పోసాని వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వరాదు : సీపీఐ రామకృష్ణ

ఠాగూర్

శుక్రవారం, 7 మార్చి 2025 (14:56 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కించపరిచి ప్రస్తుతం జైలులో రిమాండ్ నిందితుడుగా ఉన్న సినీ రచయిత పోసాని కృష్ణమురళి వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వకూడని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను దూషించినందుకు పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై రామకృష్ణ మాట్లాడుతూ, మహిళలను కించపరిచేలా మాట్లాడిన పోసాని వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వరాదని కోరారు. రాజకీయాల్లో ఉన్నపుడు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. పోసాని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, మాటల రచయిత, పోస్ట్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తి అని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి అంతలా దిగజారి నీచంగా మాట్లాడటం సరికాదన్నారు. అలాంటి మాటలు ఏ పార్టీలో ఉన్నవారు చేసినా తప్పే అవుతుందని ఆయన అన్నారు. 
 
పవన్ కళ్యాణ్‌పై కోపం ఉంటే ఆయనను విమర్శించడంలో తప్పు లేదన్నారు. కానీ, ఆయన భార్యను, ఆడపిల్లలను అవమానించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దిగజారి మాట్లాడిన పోసానిని, ఆయనలాంటి వ్యక్తులకు ఎవరూ అండగా నిలబడినా పొరపాటే అవుతుందన్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు పరస్పర విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత విమర్శలు, అందులోనూ మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు