ఆంధ్రప్రదేశ్‌కు 'నివర్' దడ... మూడు రోజుల సెలవులు... హైఅలెర్ట్!

బుధవారం, 25 నవంబరు 2020 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నివర్ దడ పుట్టిస్తోంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ తుఫాను.. రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, దక్షిణ కోస్తా జిల్లాల అధికారులకు దడ పుట్టిస్తోంది. 
 
ఇదిలావుండగా, నేటి సాయంత్రం తర్వాత నివర్ తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్యన అతి తీవ్ర తుఫాను స్థాయిలో తీరం దాటనుంది. నివర్ ప్రభావం ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు. 
 
ఇప్పటికే జిల్లాలో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. అదేసమయంలో అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. 
 
ఇదిలావుండగా, ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. నివర్ తీరం దాటిన తర్వాత నెల్లూరుతో పాటు చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
ఆయా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.
 
తీవ్రరూపం దాల్చిన నివర్ 
ఇదిలావుంటే, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన నివర్ తుఫాను ఇపుడు అతి తీవ్రరూపం దాల్చింది. గత 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే, ఈ తుఫాను బుధవారం రాత్రి 8 - 9 గంటల మధ్యలో తీరందాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
కాగా, ఈ నివర్ తుఫాను కారణంగా తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. కాగా, ఈ అతి తీవ్ర తుఫాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విళుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
 
అలాగే, గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఇక నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. దీంతో నెల్లూరు జిల్లాతో పాటు.. కృష్ణపట్నం ఓడరేవులో కూడా ప్రమాదం హెచ్చరికలు జారీచేశారు. జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని జిల్లా యంత్రాంగం కోరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు