ఆంధ్రాకు నివార్ ముప్పు... సీఎం జగన్ సమీక్ష.. ప్రధాని మోడీ వాకబు!

మంగళవారం, 24 నవంబరు 2020 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నివారు తుఫాను వల్ల ముప్పు ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ నివార్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంత ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఇప్పటికే, మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ఈ నెల 25, 26వ తేదీలలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనుండటంతో... మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం కూడా కోరింది. 
 
ఇకపోతే, ఈ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే, తుఫాన్  ప్రభావిత ప్రాంతాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖలను అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో నివర్ తుఫాను ఏర్పడిన నేపథ్యంలో సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను నేరుగా ఏపీని తాకకున్నా, సమీప ప్రాంతంలో దాని తీవ్రత ఉండనుందని తెలిపారు. అయితే ఏపీలోని పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన ఉందని, బుధవారం సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు తుపాను ప్రభావం ఉంటుందని వివరించారు.
 
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తం కావాలని హెచ్చరించారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను బుధవారం సాయంత్రం తీరం దాటనుంది. ఏపీలో దీని ప్రభావం నాలుగు జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా నివార్ తుఫాను బాధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోనులో మాట్లాడారు. తుఫాను తీరం దాటేంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. అలాగే, ఈ ముప్పు నుంచి గట్టెంక్కేందుకు ఎలాంటి సహాయమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు