అవసరమైనప్పుడు ఆహ్వానించి, అవసరం తీరిన తర్వాత అవమానిస్తారా’ అంటూ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరులు వైసీపీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాస్తంత ఆవేదన, మరికొంత ఆగ్రహంతో వారు మాట్లాడటమే కాక తమ రాజకీయ భవితవ్యంపై స్పష్టత లేని ప్రసంగాలు చేశారు. డాక్టర్ దగ్గుబాటికి ఎదురైన ఇబ్బంది పట్ల ఆవేదన చెందుతూనే ఇటీవల పార్టీలోకి తిరిగి రామనాథంబాబును తీసుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
డాక్టర్ దగ్గుబాటిని కొనసాగించాలని, కాకుంటే ఆయన స్థానంలో కుమారుడికి అవకాశం ఇవ్వాలని కొంతమంది అభిప్రాయపడగా, గొట్టిపాటి భరత్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు అన్నారు. ఈ విషయంపై దగ్గుబాటి అనుచరుల్లో ఏకాభిప్రాయం వ్యక్తంకాకపోవడంతో సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.
వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ దగ్గుబాటి ముఖ్యమంత్రి జగన్ విధించిన షరతు అనంతరం రాజకీయంగా మౌనం వహించాలని నిర్ణయించుకున్న విషయం విదితమే. ఆయన సతీమణి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగాలని కూడా నిర్ణయించుకున్నారు.
డాక్టర్ దగ్గుబాటితోపాటు ఆయన కుమారుడు హితేష్‌చెంచురామ్ కూడా రాజకీయంగా సైలెంట్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం కూడా వెల్లడికావడంతో పర్చూరు నియోజకవర్గంలోని దగ్గుబాటి అనుచరులు శనివారం సమావేశమయ్యారు. ఆయా మండలాలు, గ్రామాల నుంచి పెద్దసంఖ్యలోనే అనుచరులు హాజరయ్యారు. ముఖ్యనాయకులంతా మాట్లాడారు.
అందరి ప్రసంగాల్లోనూ వైసీపీ అధిష్ఠానం దగ్గుబాటిని అవమానపరిచిందన్న భావన వ్యక్తమైంది. అంతేగాక గత ఎన్నికల్లో టీడీపీలో చేరి వైసీపీ ఓటమికి పనిచేసిన రామనాథంబాబును పార్టీలోకి తిరిగి తీసుకోవడాన్ని వారు తప్పుబట్టారు.
ఈ విషయంలో కూడా అధిష్ఠానం అవలంబించిన తీరు దగ్గుబాటిని పొమ్మనకుండానే పొగబెట్టే విధంగా కన్పించిందని వ్యాఖ్యానించారు. రామనాథంబాబు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఏజెంట్ అని కూడా ఆరోపించారు.
అయితే ఇంత వరకూ దగ్గుబాటి అనుచరుల ప్రసంగాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ అవసరమైతే దగ్గుబాటి స్థానంలో పార్టీ ఇన్‌చార్జిగా ఎవరిని నియమించాలన్న విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు.
మార్టూరు ఏఎంసీ మాజీ చైర్మన్ జాష్ఠి వెంకటనారాయణబాబు మాట్లాడుతూ దగ్గుబాటి సైలెంట్ అయితే ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్‌ను ప్రోత్సహించి పార్టీ ఇన్‌చార్జిగా నియమించాలని కోరారు.
అంతకు ముందు మాట్లాడిన పలువురు నాయకులు గొట్టిపాటి భరత్‌ను ఇన్‌చార్జిగా నియమించాలని సూచించగా బాబు మాటలతో సమావేశంలో పాల్గొన్న మరికొందరు నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాట్లాడిన నాయకుల్లో కూడా ఎక్కువ మంది దగ్గుబాటిని కొనసాగించేలా అధిష్ఠానం వ్యవహరించాలని సూచించారు.
కానిపక్షంలో రామనాథంబాబును మాత్రం కొనసాగించవద్దని డిమాండ్ చేశారు. ఇలా నాయకుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ నాయకులు చేసిన ప్రసంగాలతో సమావేశంలో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది.
సమావేశంలో నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులు డాక్టర్ శ్యాం, కొల్లా సుభాష్, కోటా హరిప్రసాద్, చౌదరి బాబు, తోకల కృష్ణమోహన్, వెంకటనారాయణబాబు, ఆంజనేయులు, ఉప్పలపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.