రాజకీయాలకు గుడ్‌బై చెప్తా : దగ్గుబాటి పురంధేశ్వరి ఎఫ్‌బి పోస్ట్

శుక్రవారం, 3 మార్చి 2017 (09:21 IST)
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరనున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే రాజకీయాల నుంచి తప్పుకుంటామేగానీ... మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
పురంధేశ్వరి త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని, వైఎస్సార్సీపీలో చేరుతున్నారనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో పురంధేశ్వరి తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.
 
‘సామాజిక మాధ్యమాలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తుండటం చాలా బాధాకరమన్నారు. తాను పార్టీ మారుతున్నాననే వదంతులు నన్ను చాలా కలచి వేశాయని చెప్పారు. ప్రతి ఒక్కరిని, వారి మనోభావాలను గౌరవిస్తున్నాను. అదే సమయంలో, నేను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెబుతున్నట్టు గుర్తు చేశారు. 
 
తాను ఇకపై బీజేపీలోనే నేను కొనసాగుతాను. ఒకవేళ, ఆ పార్టీలో కొనసాగలేని పరిస్థితులు తలెత్తితే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా తండ్రి, నా భర్త రాజకీయ విలువలు నేర్పించారు, అదే బాటలో నేను కొనసాగుతున్నాను అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి