రూ.1362కోట్లతో పాడి పరిశ్రమ రంగ అభివృద్ధి: మంత్రి అప్పల రాజు

శనివారం, 7 నవంబరు 2020 (08:33 IST)
రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృద్ధి రంగంలో మౌళిక సదుపాయాల కల్పనకు 1362కోట్ల రూ.లను ఖర్చు చేయనున్నట్టు ఆశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడించారు.

ఈ మేరకు అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు 2017లో నవంబరు 6నుండి నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలను నేరుగా అడిగి తెల్సుకున్న క్రమంలో పాడిరైతులకు అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు.

ఆ హామీలన్నీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో పాడిపరిశ్రామాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి 1362కోట్ల రూ.ల వ్యయంతో మౌళిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారని తెలిపారు.

గతంలో సహకార రంగంలోని డైరీలన్నీమూతపడడంతో ప్రస్తుతం పాడిరైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆసమస్యలను అధికమించేందుకు ప్రభుత్వం ఇటీవల అమూల్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

అముల్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పాడిరైతులు అన్ని విధాలా మరింత స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

ఈ నెల 25న అముల్ సంస్థ ద్వారా పాలసేకరణ బిల్లులు చెల్లించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి వెల్లడించారు.

అముల్ సంస్థ రాష్ట్రంలో తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం 8 జిల్లాల్లో తన కార్యకలాపాలను సాగించేందుకు ఎంపిక చేయగా ప్రాధమికంగా ప్రకాశం,చిత్తూరు, వైయస్సార్ కడప జిల్లాల్లో ఈనెల 20 నుండి పాలసేకరణను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 70లక్షల లీటర్ల పాలను సేకరించడం జరుగుతోందని ఇది పాల ఉత్పత్తిలో 26శాతమే అన్నారు.అముల్ భాగస్వామ్యంతో రోజుకు 2కోట్ల లీటర్ల పాలసేకరణ చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని పాలసేకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషిలో భాగంగా పొటెన్షియాలిటీ ఉన్న9వేల 899 ఆర్బికెలను గుర్తించి 9899 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేటనున్నట్టు మంత్రి అప్పలరాజు వెల్లడించారు.

ఇందుకు 500కోట్ల రూ.లను ఖర్చు చేయనున్నామని మొదటి దశలో 2774,రెండవ దశలో 3639,3వ దశలో 3486 బియంసియులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.అలాగే కొత్తగా 7వేల165 పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో పాలసేకరణ చేసే మహిళా మహిళలు,మహిళా బృందాలు,రైతులకు మరింత లబ్ది కలగడంతో పాటు పాలసేకరణ రంగంలో మరింత స్వావలంబన సాధించేందుకు వీలుకలుగుతుందని మంత్రి అప్పల రాజు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు