పెద్ద నోట్లతో మోదీ కొట్టిన దెబ్బతో గింగరాలు తిరుగుతున్న చీటీ వ్యాపారులు...

బుధవారం, 7 డిశెంబరు 2016 (15:41 IST)
ఆధ్మాత్మిక కేంద్రంగానే కాక వ్యాపార కేంద్రంగానూ విరాజిల్లుతున్న తిరుమలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగానే పడింది. వ్యాపారాలు సరిగ్గా జరగకపోవడం అటుంచితే నెలవారీ చీటీల వ్యాపారం, వడ్డీ వ్యాపారంపైన నోట్ల ఎఫెక్ట్ బలంగానే ఉంది. పెద్ద నోట్ల దెబ్బకు చాలామంది చీటీపాటలు ఆపేశారు. కొందరు చీటీలనే రద్దు చేసుకుంటున్నారు. రెండు నెలల్లో అంతా సర్దుకోవచ్చని, అప్పుడు మళ్లీ యథాతథంగా చీటీలు నిర్వహించవచ్చని ఆశిస్తున్నారు. అయితే పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కుదుటుపడేలా లేవు.
 
తిరుమలలోని దుకాణదారులు చీటీల రూపంలో డబ్బులు పొదుపుచేసి, అవసరమైనప్పుడు పాడుకుని వ్యాపారానికి ఉపయోగించుకుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారాలు ఎంత భారీగా ఉంటాయో చీటీలూ అంతే భారీగా ఉంటాయి. తిరుమల వ్యాప్తంగా చీటీలు నిర్వహించేవారు 200 మంది దాకా ఉంటారని అంచనా. లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల దాకా చీటీలు నిర్వహించే వారు ఉన్నారు. తిరుపతిలో నిర్వించే 5కోట్ల చీటీల్లోనూ తిరుమల వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ సందిగ్థంలో పడ్డాయి.
 
ఏ చీటీ అయినా మొదటివారంలో పాట జరుగుతోంది. గత నెల 8వతేదీ రాత్రి పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చే సమయానికి చాలా వరకు చీటీలు ముగిసి చెల్లింపులు కూడా జరిగిపోయాయి. ఈ నెలకు  సంబంధించి చీటీ చెల్లించడానికి అవసరమైన నగదు లేదు. 10లక్షల చీటీకి 40 వేలు దాకా చెల్లించాలి. 20లక్షల చీటీ అయితే 80వేలు కట్టాల్సి ఉంటుంది. కోటి రూపాయల చీటీకి 5 లక్షల దాకా నెలకంతు ఉంటుంది. లక్ష రెండు లక్షల చీటీలు ఫర్వాలేదు గానీ పెద్ద పెద్ద చీటీలే ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి. వాయిదా చెల్లించడానికి అవసరమైన నగదు సభ్యుల వద్ద లేదు. పాత నోట్లు ఇవ్వడానికి సభ్యులు సిద్థమైనా పాడుకునేవారు వాటిని తీసుకోవడానికి సిద్థంగా లేదు. అలాగని కొత్త నోట్లతోనే చీటీ నిర్వహించాలంటే అంత మొత్తం నోట్లు లేవు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో చెల్లింపుకలకు డబ్బులు లేకుండా పోయాయి.
 
ఈ పరిస్థితుల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాకే పాట నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు నెలలు ఆలస్యమైనా కొత్త నోట్లు అందుబాటులోకి వస్తే ఇబ్బంది ఉండదని డిసెంబర్‌, జనవరి నెలల్లో పాటలు నిర్వహించకూదడని అనుకుంటున్నారు. ఇప్పటికే చీటీలు పాడుకున్న వారికి నష్టం లేదుగానీ ఇంకా పాడుకోని వారు మాత్రం దీని వల్ల నష్టపోతారు. డిసెంబర్‌, జనవరి నెలల్లో చీటీలు పాడుకుందామనుకున్న వారికి ఇప్పుడు మార్గం కనిపించడం లేదు. చీటీపాడి ఎవరికైనా అప్పు చెల్లించాలనుకుని ఉంటే ఇంకో రెండు నెలలు వడ్డీ భరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల క్రితం చిట్టీలు ప్రారంభించిన ఒక వ్యక్తి దాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు సమాచారం. సభ్యుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఏదో ఒక విదంగా సర్దుబాటు చేసి వెనక్కి ఇచ్చేశారట. ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైన చీటీలను కొనసాగించేలా, ఆపేయాలా అన్న సందిగ్థంలో ఉన్నారు పలువురు చీటీల యజమానులు.
 
తితిదే ఉద్యోగుల్లోనూ చీటీలు నిర్వహించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు తోటి ఉద్యోగులు 20మందిని కలుపుకుని చిన్న చిన్న చీటీలు నడుపుకుంటున్నారు. తిరుమలలో ఒక ఉద్యోగి కోటి రూపాయల చీటీ కూడా నిర్వహించేవారట. ఇళ్ల వద్ద చీటీ పాటలు నిర్వహించి డబ్బులు అందజేస్తుంటారు. అంతా నమ్మకంపై సాగే చీటీల వ్యాపారంలో అత్యంత సన్నిహితులే ఒక గ్రూపులే ఉంటారు. ప్రతినెలా తలాకొంచెం పోగేసి ఒక్కోనెలలో ఒకరు డబ్బులు తీసుకుంటారు. ఒక విధంగా ఇది సహకార వ్యవస్థ వంటిది. ఇలాంటి దానికి నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీతో ఇబ్బంది వచ్చి పడింది. 
 
రెండు నెలల్లో సమస్య సమసిపోతుందని అంతా ఆశిస్తున్నారు గానీ క్షేత్రస్థాయి వాస్తవాలు చూస్తేంటే ఈ సంక్షోభం ఒక కొలిక్కిరావాలంటే ఏడాది సమయమన్నా పట్టేలా ఉంది నోట్లు అందుబాటులోకి వచ్చినా ఇప్పటిలాగా చీటీల వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తుండడే ఇందుకు కారణం. మొత్తం లావాదేవీలను నగదు రహితంగా మార్చాలని, అన్నీ ఆన్‌లైన్‌ లావాదేవీలుగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కోట్ల రూపాయల చీటీలు ప్రైవేటుగా నిర్వహించే అవకాశం ఉండదు. చీటీల భవిష్యత్తు ఎలా ఉంటుందో రెండు నెలల తరువాతగానీ తెలియదు.

వెబ్దునియా పై చదవండి