కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ, నిజ నిర్ధారణకు వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ఉదంతం ఇంకా చల్లారలేదు... ఇపుడు మళ్ళీ ఇంకో నిజనిర్ధారణ కమిటీ కొండపల్లికి బయలుదేరింది.
అదీ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో...నందిగామ నుంచి కొండపల్లిలో జరిగిన అక్రమ మైనింగ్ పరిశీలనకు తెలుగుదేశం పార్టీ నిజ నిర్థారణ కమిటీ బయలుదేరింది. దీనితో వారు కొండపల్లి వెళ్లకుండానే, నిజ నిర్థారణ కమిటీ సభ్యురాలు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని పోలీసులు ముందస్తుగా నందిగామలోనే హౌస్ అరెస్ట్ చేశారు.
ఆమెతోపాటు నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాలలోని ప్రధాన నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమ కొండపల్లి ఫారెస్ట్ నిజనిర్ధారణకు వెళ్లడంతోనే, శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని...అందుకే, ఇపుడు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొండపల్లి పర్యటనను అడ్డుకున్నామని పోలీసులు చెపుతున్నారు.
గత మూడు రోజుల క్రితం అరెస్టయిన దేవినేని ఉమ ఇంకా రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ తేవాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తుండగా, పోలీసులు మాత్రం ఉమను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనితో కొండపల్లి రిజర్వ ఫారెస్ట్ క్వారీయింగ్ ఇపుడు పోలీసులకు తలనొప్పి వ్యవహారంగా మారింది.