రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉందని తెలుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమారు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుటుంబానికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఓటరు కార్డు వివరాలతో సహా ట్వీట్ చేశారు. "క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్‌గా బుక్ అయ్యాడని, రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని ధూళిపాళ్ల పేర్కొన్నారు. పొన్నూరులో ఒక ఓటు ఉందని, మంగళగిరిలో మరో ఓటు ఉందని వెల్లడించారు. "తాడేపల్లి ప్యాలెస్‌లోనే దొంగ ఓట్ల దందా మొదలైందనడానికి ఇదిగో సాక్ష్యం. తెల్లవారితే మైక్ ముందు నీతి వ్యాక్యాలు వల్లించే క్యాంప్ ఆఫీస్ క్రర్క్ సజ్లల అండ్ ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు" అంటూ ట్వీట్‌లో వివరించారు.
శాసనసభ సాక్షిగా ఎన్టీఆర్ కుమార్తెను అవమానిస్తే స్పీకర్‌గా నువ్వు పీకిందేంటి అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆయన తాను చేపట్టిన శంఖారావం సభ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగింది. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డమా బుస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 తర్వాత ఆముదాలవలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమా బుస్సు ఎమ్మెల్యేని గెలిపించారని లోకేశ్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే... నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం అని వివరించారు.
'ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు... తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని అంటుంటాడు. ఈ డమా బుస్సును అడుగుతున్నా... అదే ఎన్టీఆర్ కుమార్తెను శాసనసభ సాక్షిగా అవమానిస్తే నువ్వు పీకిందేంటి? చేసిందేంటి? ఇవాళ శాసనసభకు కనీస గౌరవం లేదంటే అందుకు కారణం ఈ డమా బుస్సు ఎమ్మెల్యే. వాస్తవానికి 2019కి ముందు తమ్మినేని సీతారాంను నేను చాలా గౌరవించాను. ఎప్పుడైతే శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ, ప్రతిపక్ష నేతను అవమానిస్తుంటే పట్టించుకోలేదో, ఆ రోజే ఆయన గౌరవం పోగొట్టుకున్నాడు.
ఈ డమా బుస్సు ఎమ్మెల్యే అవినీతిలో పలాస ఎమ్మెల్యే కొండలరాజుతో పోటీ పడుతున్నాడు. ఐదేళ్లలో ఎవరూ ఊహించనంతగా రూ.1000 కోట్లు సంపాదించాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. లాండ్, శాండ్, మైన్ అన్నింటికీ ఆముదాలవలసను అడ్డాగా మార్చేశాడీ డమా బుస్సు ఎమ్మెల్యే. కొడుకు పెళ్లి జరిగితే కాంట్రాక్టర్లను వేధించి రూ.1.30 కోట్లు వసూలు చేశాడు. కేవలం ఇసుకలోనే రూ.300 కోట్లు స్వాహా చేశాడు. వాలంటీరు పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్టు పోస్టులు సొంత కార్యకర్తలకు కాదు కదా, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇచ్చాడు ఈ డమా బుస్సు ఎమ్మెల్యే" అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.