ఏపీ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదు చెల్లింపులు... రాత్రికి రాత్రే డిజిటల్ విధానం అమలు

ఠాగూర్

మంగళవారం, 28 మే 2024 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో గత ఐదేళ్లుగా నగదు లావాదేవీల్లో మద్యం విక్రయాలు జరుపుతూ వచ్చింది. కానీ, సోమవారం నుంచి ఉన్నఫళంగా డిజిటల్ చెల్లింపులు చేపట్టింది. ఈ మేరకు అన్ని మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై విపక్ష నేతలు సైతం విస్తుపోతున్నారు. గత ఐదేళ్లుగా లేని డిజిటల్ చెల్లింపులు ఇపుడే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా నగదునే తీసుకుంటూ డిజిటల్ చెల్లింపులకు ఆస్కారమే లేకుండా వైకాపా ప్రభుత్వం చేసింది. కానీ, ఏపీ అసెంబ్లీకి ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో స్వీకరించాలని లక్ష్యాల్ని విధించి మరీ విక్రయాలు చేయిస్తోంది. కొన్ని జిల్లాల్లోని దుకాణాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపులనే తీసుకోవాలని మౌఖికంగా ఆదేశాలిచ్చింది. 
 
మరికొన్ని జిల్లాల్లో 70-80 శాతం లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులే స్వీకరించాలని, సాధ్యమైనంత వరకూ నగదు తీసుకోవద్దని ఆదేశించింది. ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన వైకాపా వీర విధేయ అధికారి వాసుదేవ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసి, ఆ స్థానంలో కొన్నిరోజుల కిందట టీఎస్ చేతను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టాక సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లకు లక్ష్యాలు విధించి మరీ డిజిటల్ లావాదేవీలు చేయాలని ఆదేశించారు. 
 
ఫోన్, గూగుల్ పే, పేటీఎం లేదా కార్డు స్వైపింగ్ వంటి ఏదో ఒక డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేయాల్సిందేనంటూ రెండు రోజులుగా వినియోగదారులపై సేల్స్‌మెన్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. నగదు రూపంలో చెల్లింపులు వద్దని చెబుతున్నారు. దీంతో దుకాణాల వద్ద వినియోగదారులతో ఘర్షణలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. 
 
డిజిటల్ పద్ధతుల్లో చెల్లింపులు స్వీకరించాలని లక్ష్యాలు విధిస్తున్న ఏపీఎస్ బీసీఎల్... ఆ రూపంలో చెల్లించే వినియోగదారులపై అదనపు భారం వేస్తోంది. ఒక సీసా కొంటే చాలు దాని ఎమ్మార్పీపై అదనంగా రూ.1.18 వసూలు చేస్తోంది. మద్యం సీసాను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపుల ఆప్షన్ ఎంపిక చేస్తే చాలు... దానిపై అదనపు ధర పడిపోతోంది. ఈ భారం ఏపీఎస్ బీసీఎల్ మోయకుండా వినియోగదారులపైనే వేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు