శారీరక, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి ఆధ్యాత్మిక చింతన, వ్యాయామం
శుక్రవారం, 3 నవంబరు 2017 (18:35 IST)
అమరావతి: దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ మానసిక, శారీరకపరమైన ఒత్తిడుల నుండి ఉపశమనం పొందేందుకు ఆధ్యాత్మిక చింతన, వ్యాయామం ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాకులో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విజయవాడ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో డైల్యూటింగ్ స్ట్రెస్ వర్కులైఫ్ బ్యాలెన్స్ (Diluting Stress Work Life Balance) అనే అంశంపై సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతిఒక్కరూ ఏదో ఒక విషయంలో నిత్యం మానసిక శారీరకపరమైన ఒత్తుడులను ఎదుర్కోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాంటి ఒత్తుడుల నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ యోగా, ఇతర శారీరక, మానసిక వ్యాయామాలు చేయడంతోపాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని అన్నారు. ఈవిధంగా చేయడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునేందుకు అన్ని విధాలా దోహదపడతాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉద్యోగులు ఒత్తిడుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అనేక మెళుకువలను బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయం సిస్టర్ ఆశా తెలియజేశారని అన్నారు. సచివాలయ ఉద్యోగులకై ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారిచే ఇక్కడ ఒకరోజు సెమినార్ కార్యక్రమం నిర్వహించడం పట్ల వారికి ప్రభుత్వం తరుపున ఆయన అన్ని విధాలా అభినందనలు తెలియజేశారు.
ఈ సెమినార్లో ప్రజాపిత బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం, ఓమ్ శాంతి రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ సిస్టర్ బికె ఆశా మాట్లాడుతూ ఏదైనా సమస్య ఎదురైనపుడు మన మనస్సులోని అలజడి పేరే స్ట్రెస్(Stress) అని ఇది బాహ్యమైనది కాదని మనస్సు లోపల కలిగే ఒత్తిడినే స్ట్రెస్ అని అంటామని పేర్కొన్నారు. స్ట్రెస్ ఉన్నప్పుడు పరిస్థితిని చక్కగా అర్ధం చేసుకోవాలని, ఉన్నది ఉన్నట్టుగా చూడాలని, పరిస్థితిని ఎదుర్కోగలిగే అంతర్గత శక్తులను తనలో వృద్ధిచేసుకోవాలని అన్నారు. ఏదైనా పరిస్థితి ఎదురైనపుడు ముందు దానిని తప్పించుకోగలమా(Avoid)అని చూడాలని అలా జరగదనుకుంటే ప్రత్యామ్నాయం(Alternate) చేయగలమా అని చూడాలని అదీ సాధ్యం కాదనుకుంటే(Accept) అంగీకరించాలని సూచించారు. తప్పదుకదా, సహించాలికదా అనే భావనతో కాకుండా చేయవలసిన పనిని సంతోషంగా చేయాలని, అప్పుడే ఆ పనిని బాగా చేయగలమని తద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతామని పేర్కొన్నారు.
జీవితం అనేది ఒక పండుగ అనీ, కావున డిప్రెషన్‌కు మనం అవకాశం ఇవ్వకుండా గతంలో సాధించినవి గుర్తుచేసుకుంటూ తనను తాను ఉత్సాహపర్చుకుంటూ ఇతరులను కూడా ప్రోత్సహించాలని అప్పుడే అందరి సహయోగం ఉంటుందని సిస్టర్ బికె ఆశా సూచించారు.సర విశేషతలను చూడాలని, అందరినీ ప్రోత్సహించాలని చెప్పారు.అన్ని పనులు చేయాలి కాని కర్మ యోగముగా(Work is Worship) ఉండాలని ఇందుకు ఆధ్యాత్మిక శక్తి ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తన ఆలోచనలపై తాను యజమానిగా ఉండాలని అప్పుడే అన్ని పరిస్థితులపై మాస్టర్‌గా అవుతారని అన్నారు. అడ్మినిస్ట్రేషన్లో మొదట తన ఆలోచనలను గవర్న్ చేయగలగాలని అప్పుడే మిగిలిన అన్నిటిపై మాస్టరీ ఉంటుందని చెప్పారు. అంతేగాక అందరి యందు గుడ్ విసెస్ ఉండాలని ఇవన్నీ చేయగలగాలంటే మనస్సుని పరమాత్ముని వైపు జోడించి శక్తిని పొందాలని అప్పుడు మీరు ఏ సంకల్పం చేస్తే అది నేరవేరుతుందని(As you think,so you become)సిస్టర్ బికె ఆశా పేర్కొన్నారు. ఈ సెమినార్లో ప్రజాపిత బహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విజయవాడ ఇన్‌చార్జి శాంతా బెహన్, సిబితా బెహన్, పద్మజ బెహన్, సచివాలయంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.