తొమ్మిది మంది అధికారుల తొలగింపు: ఎస్‌ఈసీ కఠిన చర్యలు

శనివారం, 23 జనవరి 2021 (09:37 IST)
పంచాయితీ ఎన్నికల విషయంలో తనకు సహకరించని అధికారులపై ఎస్‌ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. పంచాయితీ ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఎస్‌ఈసీకి సహకరించని పంచాయితీరాజ్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమీషనర్‌ గిరిజాశంకర్‌కు 'నిమ్మగడ్డ' మెమూలు జారీ చేశారు.

వారితో పాటు గతంలో చర్యలు తీసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేసి దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది.

దీంతో ఈ రోజు మళ్లీ సుప్రీంలో ప్రభుత్వ పిటీషన్‌ వచ్చే పరిస్థితి లేదు. శని,ఆదివారాలు ఎలాగూ కోర్టుకు సెలవులు కనుక సోమవారం నాడు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ లోపే ఎన్నికల కమీషనర్‌ జోరు పెంచారు. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల గురించి తనతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్‌ కార్యదర్శి, కమీషనర్‌, ఇతర అధికారులను కలవాలని ఆదేశించారు. అయితే ఎస్‌ఈసీ ఆదేశాలను వారు పట్టించుకోలేదు. దీంతో రమేష్‌కుమార్‌ పలువురు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.

కాగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణలో ఎస్‌ఈసీకి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. పలువురు అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు, పోలీసు సంఘ నేతలు ఎన్నికల్లో తాము పాలుపంచుకోలేమని స్పష్టం చేస్తున్నారు. తనకు సహకరించని వీరందరిపై చర్యలు తీసుకునే అధికారం 'నిమ్మగడ్డ'కు ఉంది.

సహకరించని అధికారులపై వేటు వేస్తూ ఎన్నికలను నిర్వహించడానికి ఇతర మార్గాలను ఆయన అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అధికారులను, కేంద్ర బలగాలను ఎన్నికలు నిర్వహించడానికి పంపించాలని ఆయన గవర్నర్‌ ను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే కాకుండా రాష్ట్రంలో ఎన్నికల పక్రియలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న ఇతర వర్గాలను కూడా ఆయన ఎంపిక చేసుకునే పరిస్థితి ఉందని రాజకీయ, అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ఎన్నికల కమీషనర్‌, ప్రభుత్వ పెద్దల మధ్య పెరిగిన పంతం ఉద్యోగులను ఇక్కట్ల పాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు