ఇసుక, మద్యం ఎవరు అక్రమ రవాణా చేసినా వదలొద్దు: కలెక్టర్లు, ఎస్పీలతో జగన్
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:46 IST)
స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం వైయస్ జగన్, చివరగా కొన్ని అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.
ఎరువుల లభ్యత:
ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని, మండల స్థాయిలో ఎంత అవసరం?. ఎంత లభ్యత ఉంది? అన్న అంశాలను పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
ఎస్పీలకు అభినందనలు:
క్రితం సారి కొన్ని విషయాలు తాను ప్రస్తావించానని, ఆ తర్వాత వాటిపై పత్రికల్లో చదివానని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని కధనాలు చదివానని తెలిపారు.
వాటికి సంబంధించి సీఐ, ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్ వరకు స్పష్టమైన మెసేజ్ తీసుకుపోలేకపోతే, మంచి ఫలితాలు రావని అన్నారు. ఆ దిశలో తమ సిబ్బందిని బాగా సెన్సిటైజ్ చేశారంటూ సీఎం వైయస్ జగన్ జిల్లాల ఎస్పీలను అభినందించారు.
అక్రమ రవాణా నియంత్రణ:
మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న ముఖ్యమంత్రి, వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్‌ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అన్నారు.
చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ:
ఏదేమైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. అందుకే ఎవరు ఆ అక్రమ రవాణాకు పాల్పడినా సరే, విడిచి పెట్టవద్దన్న ఆయన.. ‘చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ..ఎనీ థింగ్ ఇల్లీగల్. ప్లీజ్ డోండ్ హెసిటేట్’.. అని స్పష్టం చేశారు.
ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు.