అమరావతి : రానున్న ఎన్నికల్లో మెదీని ప్రధాని కాకుండా బిజెపిని ఓడించడమే టిడిపి లక్ష్యమని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలోని 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసిపి ఎంపిలు సభలో వుండి కూడా ఎన్నికలో పాల్గొనకుండా ఉండటాన్ని బట్టి బిజెపి-వైసిపిల లాలూచీ రాజకీయాలు బహిర్గతం అయ్యాయని పేర్కొన్నారు.
అంతకుముందు ఆ పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి బిజెపిని ఓడిస్తామని చెప్పి బిజెపికి అవసరమైతే ఓటేసి సాయపడదామనే ఉద్దేశ్యంతో సభలో ఉండటం ఎంతవరకు సబబు అని ఆయన వైసిపిని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ రాహూల్ గాంధీ అడగలేదు కాబట్టి మేము ఓటింగ్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశారని, అలాంటి కారణాలేమైనా ఉంటే వైసిపి చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అంతేగాక గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అడగకుండానే మద్దతు ఇచ్చారని, ఇటీవల జరిగిన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా బిజెపికి వైసిపి ఓటు వేసిందని మాణిక్యవర ప్రసాద్ గుర్తు చేశారు. వైసిపి ఈవిధంగా ప్రజలను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎందుకు మోసం చేస్తున్నదో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిపై పోరాడుతూ ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రత్యేక హోదా సాధనకై ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తుంటే అందుకు భిన్నంగా వైసిపి బిజెపితో ప్రయాణం చేయడం ఎంతవరకూ సబబని డొక్కా మాణిక్య ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేయాల్సిన ఆవశ్యకత టిడిపికి లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో బిజెపి అధికారానికి రాకుండా నివారించే పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని మాణిక్య వరప్రసాద్ పునరుద్ఘాటించారు. కాగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో తెదేపా ఏమయినా కలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి.. ఏం జరుగుతుందో?