చిరు లేకుంటే నువ్వెక్కడ పవన్... వారసత్వంపై మాట్లాడే హక్కు నీకు లేదు...

మంగళవారం, 16 అక్టోబరు 2018 (17:29 IST)
అమరావతి : వారసత్వంపై మాట్లాడే నైతిక హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేదని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను కించపరుస్తూ మాట్లాడం సరికాదన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడిని కాదని, రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్‌ను పవన్ కల్యాణ్ విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. 
 
పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ రంగాల ప్రవేశం ఆయన అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లోనే సాగిందన్నారు. చిరంజీవే లేకపోతే పవన్ అనే వ్యక్తి ఎక్కడ ఉండేవారని విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. చిరంజీవి పేరు చెప్పుకునే నేడు పవన్ కల్యాణ్ కుటుంబానికి చెందిన 8 మంది హీరోలుగా చలామణి అవుతున్నారన్నారు. రాష్ట్రంలో అత్యధిక సినిమా థియేటర్లు రెండు మూడు కుటుంబాలు చేతిలోనే ఉన్నాయన్నారు. ఈ రెండు మూడు కుటుంబాల్లో పవన్ కల్యాణ్ కుటుంబం ఒకటన్నారు. అటు సినిమా, ఇటు రాజకీయం... ఇలా రెండింటిలోనూ వారసత్వ మాటునే పవన్ కల్యాణ్ రంగ ప్రవేశం చేశారన్నారు. అటువంటి పవన్‌కు వారసత్వాలపై మాట్లాడే అర్హతలేదని విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు