మా అన్నయ్య చిరంజీవి వద్ద సెక్యూరిటీ గార్డ్ అయితే చాలనుకున్నా...

మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:47 IST)
జనసేన కవాతు సభలో పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ... మనకు ఎందుకు కారు లేదు అని చిన్నప్పుడు మా నాన్నను అడిగాను. ‘ఏదైనా సరే.. అబద్ధపు సొమ్ముతో నీకు మంచి జరుగదురా.. మనకున్నదాంట్లో మోటార్ బైక్‌తో బతుకు చాలు’ అని విలువలను నేర్పించారు. నేను కోరుకుంది మహా అయితే.. డిగ్రీ పాసయి, ఎస్సై అయితే బాగుణ్ను అనుకున్నాను. పాస్ కాకపోతే.. మా అన్నయ్య చిరంజీవి వద్ద సెక్యూరిటీ గార్డ్ అయితే చాలనుకున్నా.. అంతకుమించి కోరికల్లేవ్. కానీ భగవంతుడు సినిమాల్లో పెట్టాడు. 
 
అయితే నేను ఏ పని ఇచ్చినా త్రికరణశుద్ధిగా చేస్తాను. అలాంటి జీవితం నాది. మీ అందరూ ప్రేమతో తలా పది రూపాయలు పెట్టి టికెట్ కొంటే అదే నాకు ఆస్తి. సంవత్సరానికి వంద కోట్లు సంపాదించగలను. కానీ దానిని వదలుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ ఉన్న వ్యవస్థ గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. నేను బలమైన వ్యవస్థను కోరుకున్నాను. ఇప్పుడున్న వ్యవస్థ దరిద్రంగా తయారైంది. నా స్వార్థం చూసుకుంటూ దీనిని నేను వదిలేస్తే బలం ఉండి, శక్తి ఉండి, భావజాలం ఉండి కూడా మనమే బాధ్యత తీసుకోకుంటే తప్పు అనిపించింది. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 
 
పెన్షన్ స్కీమ్ విషయానికి వస్తే దశాబ్దాలు ప్రభుత్వానికి గొడ్డు చాకిరీ తర్వాత.. రిటైర్మెంట్ తర్వాత భద్రత కావాలని కోరుకుంటారు. అలాంటి భద్రత ఉన్న భాగాన్ని ప్రభుత్వం పీఎఫ్‌గా తీసేసి పెన్షన్‌గా ఇస్తే.. అలాంటి పెన్షన్‌ను కాలరాస్తున్నారు. సాంప్రదాయక పెట్టుబడులు పెట్టాల్సిన చోట, స్టాక్ మార్కెట్‌లలో జూదంలలో ఆ డబ్బు పెట్టేశారు. ఏమూలకెళ్లినా నష్టపోతున్నాం దెబ్బలు తింటున్నాం అని సీపీఎస్ రద్దు చేయమంటే.. ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఉద్యోగులందరికీ నేను మాట ఇస్తున్నా... జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సీపీఎస్ రద్దుచేస్తాం అని చెబుతున్నా. అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి. కేంద్రానికి పంపిస్తాం అని  చెబుతున్నా. 
 
మొగల్తూరులో మాకు పొలం ఉండేది.. గోదావరి జిల్లాలో ఎందుకున్నానంటే.. నా మూలాలున్న జిల్లా ఇది. నాకు తెలంగాణ బాగా తెలుసు. అక్కున చేర్చుకుంది. మా నాన్న బతికిన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప అన్ని ప్రాంతాలూ  తెలుసు. కానీ మా మూలాలున్న గోదావరి జిల్లా నాకు తెలియదు. మూలాలుండే జిల్లాను తెలుసుకోవడం కోసం ఎక్కువ గడిపాను. మూలాలను సంస్కృతిని అర్థం చేసుకోడానికి నెల రోజులపైన అణువణువునా పర్యటిస్తాను. కాకినాడ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు.. అన్నీ కూలంకషంగా అర్థం చేసుకుంటా. ఏ విషయంలో అయినా సరే.. మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చా. జనసేనను మీరు ఆదరించండి. హత్తుకోండి. ఇక్కడ అన్ని సీట్లూ గెలిపించి చూపిద్దాం చంద్రబాబుకు.
 
ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలంటే మూలాల నుంచి మార్పులు రావాలి.  ఆ మూలాలు గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు కావాలి. అలాంటి గ్రామాలకు ఈ రోజున సర్పంచి ఎన్నికలు రావాల్సి ఉంది. పంచాయతీల గడువు అయిపోయింది. ఎన్నికలు పెట్టాలి. కానీ ప్రభుత్వం పెట్టదు. ఓడిపోతామనే భయమున్నోడు గనుక చంద్రబాబు ఎన్నికలు పెట్టడు. గెలుస్తామనే ధైర్యం లేదు గనుక ప్రధాన ప్రతిపక్షం దీని గురించి అడగదు. కాబట్టే జనసేన అడుగుతోంది. పంచాయతీ ఎన్నికలు పెట్టండి మా సత్తా చూపిస్తాం అని నేను అడుగుతున్నా. ఎన్నికలు జరక్కపోవడం వల్ల.. గ్రామాలను బాగు చేయడానికి ఉపయోగపడగల కేంద్ర నిధులు వెనక్కెళ్లిపోతున్నాయి. గ్రామాల్లో రోడ్లు బాగుపడతాయి.. ఒక మంచి ప్రాథమిక ఆస్పత్రి బాగవుతుంది.. ఇలాంటివన్నీ ఉన్నా.. ఎన్నికలు మాత్రం పెట్టరు. నిజంగా పంచాయతీ రాజ్ వ్యవస్థను సీఎం నిర్జీవం చేస్తోంటే. లోకేష్ నిర్వీర్యం చేస్తున్నారు. చంపేస్తున్నారు. వారిద్దరికీ చెబుతున్నా.. పంచాయతీ ఎన్నికలు పెట్టండి.. వాటిని ఆపేసే హక్కు మీకు లేదు. రాజ్యాంగేతర శక్తిగా మీరు చేస్తున్నారు. కోర్టు దగ్గర చివాట్లు తినకుండా.. ఎన్నికలు పెట్టండి. లేకుంటే మాజీ సర్పంచులతో బలమైన ఉద్యమం చేస్తాం.
 
పంచాయతీ వ్యవస్థ కూలిపోతోంది. అది ఎంత బలమైందంటే.. కిర్లంపూడి మండలంలో బూర్గుంపాడు గ్రామంలో సూర్యచందర్ అనే సర్పంచి.. ఎంత గొప్ప పని చేసాడంటే.. చెత్త నుంచి సంపద సృష్టించాడు. ఈ రోజు ముఖ్యమంత్రి ఆ పాలసీని తీసుకెళ్లి అమెరికాకు వెళ్లారు. దానికి అవకాశం ఇచ్చిందే మన సర్పంచి. ఈ వ్యవస్థ అంత బలమైంది. ప్రభుత్వం జన్మభూమి కమిటీల ముసుగులో ఆ వ్యవస్థను చంపేసింది. ప్రధాన ప్రతిపక్షం గ్రామ సచివాలయాలను మేనిఫెస్టోలో పెట్టారు. అంతా అదే పనిచేస్తున్నారు. 
 
మనం మూల కారణాలు వెతుకుతాం. అందరూ వచ్చే ఎన్నికలు గెలవడమెలా అనే ఆలోచిస్తున్నారు. జన్మభూమి కమిటీల్ని గూండా, దోపిడీ కమిటీలుగా చేశారు. ఆ గ్రామస్వరాజ్యం కోసం సర్పంచి వ్యవస్థను బలోపేతం చేస్తాం.. ఎంత విసిగిపోయారో తెలుగుదేశం సర్పంచిలు, కౌన్సిలర్లు, మనిసిపల్ చైర్మన్లు.. జనసేనలో చేరుతాం అంటున్నారు. ప్రజాబలంతో గెలిచిన వారిని పక్కన పెట్టి.. జన్మభూమి కమిటీలు వేయడం ఏమిటి? అదే కరెక్టు అయితే.. సీఎం గారూ మీరు దిగిపోండి.. చీఫ్ సెక్రటరీ పరిపాలన చేస్తే చాలు కదా! పంచాయతీ మంత్రిగా లోకేష్ దిగిపోవాలి.. అధికార్లు పాలించేస్తారు కదా.. ఇలా మాట్లాడే వాళ్లొక్కరు లేరు. 
 
జనసేన పార్టీలో నాయకులు లేరు అని విమర్శిస్తుంటారు. నాయకులు ఎందుకు లేరు.. వస్తారు. ఇవాళ శ్రీ నాదెండ్ల మనోహర్‌లాగా, శ్రీ తోట చంద్రశేఖర్‌లాగా, శ్రీ మాదాసు గంగాధరంలాగా మూలమూలల నుంచి ఇంకా అనేకమంది జనసేనలోకి వస్తారు. 
 
మళ్లీ చెబుతున్నా. చంద్రబాబుకు 2014లో గెలుస్తానని నమ్మకం లేదు. భోజనానికి పిలిచారు. అక్కడే లోకేష్ ఉన్నారు. మన కూటమి గెలవకపోతే.. జగన్ సీఎం అయితే.. మనం కలిసి పోరాటం చేయాలన్నారు. ఇవాళ వారికే అధికారం వచ్చేసరికి, నన్ను మరిచిపోయారు. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము, శక్తి మీకు లేవు. ఇలాంటి దోపిడీ వ్యవస్థను అలాంటి వ్యక్తిని ఎదుర్కొనే ధైర్యం జనసేనకుంది, పవన్ కల్యాణ్‌కు ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు