తెలంగాణాలో మరో కరోనా కేసు.. డీఎస్పీ కుమారుడికి కరోనా..

సోమవారం, 23 మార్చి 2020 (07:56 IST)
తెలంగాణాలో మరో కరోనా కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన ఓ డీఎస్పీ కుమారుడుకి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, అతని కుటుంబ సభ్యులను కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచి... వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి డీఎస్పీగా పని చేస్తున్నారు. ఈయన 23 యేళ్ళ కుమారుడు లండన్‌లో చదువుకుంటున్నాడు. ఈ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అనంతరం కారులో కొత్తగూడెం వెళ్లాడు. 20వ తేదీ వరకు అక్కడ ఇంట్లోనే ఉన్నాడు. 
 
ఈ సందర్భంగా కొందరు బంధుమిత్రులను కూడా కలిశాడు. 20న దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అదే రోజు అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అక్కడ బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఈ ఫలితాలు ఆదివారం రాగా, వాటిలో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో కొత్తగూడెం జిల్లాలో కలకలం రేగింది. 
 
మరోవైపు, డీఎస్పీ కుటుంబ సభ్యులు మొత్తాన్ని వెంటనే గాంధీ ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, పోలీసు శాఖలోనూ ఆందోళన మొదలైంది. డీఎస్పీకి కూడా కరోనా సోకే ఉంటుందని భావిస్తున్నారు. 
 
ఆయన కుటుంబం, వారితో సన్నిహితంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు, బాధిత యువకుడిని తీసుకెళ్లిన కారు డ్రైవర్ సొంతూరు వెళ్లినట్టు తెలియడంతో అక్కడి వారిలోనూ ఆందోళన మొదలైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు