ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్ డౌన్.. ఇంటికి రూ.వెయ్యి : సీఎం జగన్ ప్రకటన
ఆదివారం, 22 మార్చి 2020 (20:08 IST)
కరోనా వైరస్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించడంలో భాగంగా ఇతర రాష్ట్రాల కంటే గట్టి చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోందన్నారు. దీంతో భయానకర వాతావరణం నెలకొందన్నారు. అయితే, మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉన్నా, ఇతర రాష్ట్రాల పరిస్థితులు, దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వరకు లాక్‌డౌన్ విధించక తప్పడంలేదన్నారు.
ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, ఇతర వాహనాలు వినియోగించుకోవచ్చన్నారు. అది కూడా ఆటోలు, ఇతర వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోరాదని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎవరైనా ధరలు పెంచితే కలెక్టర్లు కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, దీన్ని వ్యాపారంగా మార్చుకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని అన్నారు. ఏ వస్తువు ఎంతకు అమ్మాలో కలెక్టర్లు వెల్లడిస్తారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున కూరగాయల నుంచి సరుకుల వరకు ఒక రేటు ఫిక్స్ చేస్తామని, అంతకంటే ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మినట్టు తెలిస్తే వారిని జైలుకు పంపిస్తానని జగన్ హెచ్చరించారు.
వారిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. దీనిపై ఒక టోల్ ఫ్రీ నంబరు ఇస్తామని, దీనికి ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీళ్లు, కూరగాయలు, పాలు, మాంసం, విద్యుత్తు, టెలికాం, ఆహార సరఫరా, మందుల షాపులు, ఎల్పీజీ దుకాణాలు, పెట్రోల్ బంకులు ఇవన్నీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయని సీఎం వివరించారు.
పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్ణయించిన విధంగానే జరుగుతాయని చెప్పారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడా పది మంది గుమికూడ వద్దని హితవు పలికారు. తాము కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని, బడ్జెట్ ఆమోదం పొందితేనే తాము ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుంటుందని వివరణ ఇచ్చారు.
వ్యవసాయదారులు, రైతుకూలీలు తప్పనిసరి పరిస్థితుల్లో పొలం వెళ్లినప్పుడు అక్కడ ఇతరులకు ఎడం పాటించాలని, వారు తమ కార్యక్రమాలు వాయిదావేసుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. ఈ వైరస్ మహమ్మారి కుర్రాళ్లకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు కానీ వారు వాహకాలుగా వ్యవహరించి ఇతరులకు సోకేందుకు కారణమవుతారని జగన్ తెలిపారు. పెద్ద వయసు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, బీపీ, షుగర్, లివర్ జబ్బులు ఉన్నవాళ్లకు దీని నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందని, దయచేసి ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
పేదలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడకూడదని భావిస్తున్నానని, ఈ నెల 29నే వీరందరికీ రేషన్ అందిస్తామని తెలిపారు. రేషన్‌తో పాటు కేజీ పప్పు కూడా ఫ్రీగా అందిస్తామని, ప్రతి కుటుంబానికి రూ.1000 ఏప్రిల్ 4వ తేదీన ప్రతి ఇంటికీ వచ్చి వలంటీర్ అందిస్తారని వెల్లడించారు. అందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏపీలో తక్కువగా ఉందంటే అది అందరి కృషి ఫలితమేనన్నారు. ఏపీలో 6 కరోనా కేసులు ఉంటే వారిలో ఒకరు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లిపోయారని వెల్లడించారు.
ముఖ్యంగా, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా బాధితులున్నారేమోనని వివరాలు సేకరించి, యాప్ ద్వారా వైద్య విభాగంతో పంచుకున్నారని, ఆ సమన్వయం ఫలితంగా కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్ నిర్వహించామని చెప్పారు.
అయితే మున్ముందు కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని తెలిపారు. ఒకరితో ఒకరు కలవడం తగ్గించడం వల్లే కరోనా వ్యాప్తి తగ్గిపోతుందని వివరించారు. అదృష్టవశాత్తు ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని, దీని పరిధి మూడు అడుగులు మాత్రమేనని వెల్లడించారు.
ఈ కనీస జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండగలిగితే దీన్ని పారద్రోలవచ్చని సూచించారు. కరోనా ఉందని అనుమానం వస్తే 104 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు. బట్టల దుకాణాలు, బంగారం షాపులు వంటివి ఈ నెల 31 వరకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోదాంలు, ఆఫీసులు ముఖ్యమైన సిబ్బందితోనే నడపాలని తెలిపారు.