పగో జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థుల వరుస మరణాలు
ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:02 IST)
పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత 30 రోజుల్లో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస మరణాలకు గల కారణాలను గుర్తించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జిల్లాలోని పలువురు విద్యార్థులు అనారోగ్యానికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ అంతుచిక్కని జ్వరాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ కళ్ల ముందే తమ పిల్లలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
ముఖ్యంగా, కొయ్యలగూడెం మండలం బోడిగూడానికి చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడకు వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, పాఠశాలను కూడా మూసివేయించారు. ఈ అంతుచిక్కని జ్వరాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది.