టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ

శనివారం, 24 నవంబరు 2018 (10:54 IST)
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కేంద్రం కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు టార్గెట్ చేశారు. సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా, సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ కంపెనీలపై చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందం సుమారు 12 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేష్ కంపెనీలతో పాటు.. సీఆర్డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు