అంటువ్యాధులను నిరోధించేందుకు కృషి చేయాలి...వెల్లూరు ప్రొఫెసర్ జార్జ్ ఎం వర్గీస్

సోమవారం, 29 జులై 2019 (06:31 IST)
దేశంలో కొత్తగా బయటపడుతున్న అంటువ్యాధులను సమర్థంగా నిరోధించడానికి వైద్యులంతా కృషి చేయాలని వెల్లూర్ సీఎంసీ ప్రొఫెసర్. డా. జార్జ్ ఎం వర్గీస్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం జరిగిన డా. పీఎస్. భాస్కర్ కుమార్ మెమోరియల్ వార్షిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా విభాగం, ఐఎంఐ బెజవాడ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ‘‘ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండియా’’ అనే అంశంపై ప్రసంగించారు. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి అంటువ్యాధులు ప్రబలుతాయని, వాటిని నిరోధించేందుకు వైద్యులు నిరంతరం అధ్యయనం చేస్తుండాలని సూచించారు. ఈ సందర్భంగా డా. పిండిప్రోలు శ్రీనివాస భాస్కర్ కుమార్(పీఎస్ భాస్కర్ కుమార్) వైద్యరంగంలో చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. వైద్య వృత్తిలో భాస్కర్ కుమార్ అనేక ఎత్తులను అధిరోహించారని కొనియాడారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె, కాకినాడ జీజీహెచ్, విజయవాడ, కొవ్వూరుల్లోని టీబీ పరిశోధనా కేంద్రాల్లో ఆయన విశేష సేవలందించారని తెలిపారు. అలాగే విజయవాడ ఈఎస్ఐలో సివిల్ సర్జన్ గా పని చేసినప్పుడు ఆయన దగ్గర వందలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారని అన్నారు. 1990-91 సమయంలో భాస్కర్ కుమార్ ఐఎంఏ విజయవాడ చాప్టర్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.

ఏపీఏ వ్యవస్థాపక సభ్యుడిగా అనేక సీఎంఈ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. వైద్యం కోసం ఎవరైనా పేదలు ఎదురు చూస్తుంటే వారికి చికిత్స అందించడంతో పాటు మందులను సైతం అందజేశారని, ఈ తరం వైద్యులంతా ఆయన స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాలని వర్గీస్ పిలుపునిచ్చారు. భాస్కర్ కుమార్ క్రీడలు, కళలు, కవిత్వంలోనూ ప్రవేశమున్న వారని, ఆయనలా అనేక రంగాల్లో ప్రతిభ చూపేవారు అరుదని కొనియాడారు.

వైద్యరంగంలో భాస్కర్ కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమని, నిజాయితీపరుడిగా, పేదల పక్షపాతిగా ఆయన పొందిన పేరు ఈ తరం వైద్యులకు ఆదర్శనీయమని వివరించారు. అనంతరం ఐఎంఏ విజయవాడ చాప్టర్ అధ్యక్షులు డా. టీవీ రమణమూర్తి, గౌరవ కార్యదర్శి డా. సీహెచ్ మనోజ్ కుమార్, ఏపీఐ కృష్ణా జిల్లా చైర్మన్ డా. కె. సుధాకర్, కార్యదర్శి డా. జి. చక్రధర్ మాట్లాడుతూ.. డా. భాస్కర్ కుమార్ వైద్యరంగంలో వేసిన బాటలు తమందరికీ ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు