గవర్నర్ నరసింహన్ రొట్టె విరిగి నేతిలో పడిందా...? ఉపరాష్ట్రపతిగా నరసింహన్...?

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (11:52 IST)
గవర్నర్ నరసింహన్... వివాదాలకు చాలా దూరంగా వుంటారు. అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకచోట కూర్చోబెట్టి హాయిగా వారితో నవ్వుతూ మాట్లాడే వాతావరణం సృష్టించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలుగువారు నిట్టనిలువుగా తెలంగాణ-ఆంధ్ర అని చీలిపోతారేమోనన్న అనుమానాలు సైతం వచ్చాయి.


కానీ గవర్నర్ నరసింహన్ చొరవతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఘాటైన వాతావరణాన్ని తగ్గించి చక్కగా కలిసిమెలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇందులో గవర్నర్ నరసింహన్ పాత్ర మరువలేనిదన్నది కేంద్రం గుర్తించింది. ఈ నేపధ్యంలో ఆయనకు ఓ కీలక పదవిని అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే... దేశానికి ఉపరాష్ట్రపతి.
 
ఈ పదవి కోసం గతంలో నరసింహన్ ప్రధానమంత్రి మోదీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే నరసింహన్ ప్రస్తావన తర్వాత ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి అప్పగిస్తే ఎలా వుంటుందన్న దానిపై మోదీ దృష్టి సారించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ కూడా పాకిస్తాన్ దేశంపై సర్జికల్ దాడులు జరిపిన సమయంలో తన అభిప్రాయాలను కూడా మోదీకి చెప్పినట్లు సమచారం. ఇవి కూడా మోదీకి చాలా బాగా నచ్చాయిట.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఈ ఆగస్టు నెలతో ముగియనుంది. ఈ నేపధ్యంలో ఆ పదవిలో నరసింహన్ ను ఎంపిక చేసే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నరసింహన్ రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా.

వెబ్దునియా పై చదవండి