సైనికుల తరహాలోనే పాత్రికేయులు కూడా నిర్విరామంగా పని

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:55 IST)
ఎంతో ప్రమాదకరమైన కరోనా విపత్తు సమయంలో కూడా పాత్రికేయులు తమ బాధ్యతను మర్చిపోకుండా సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్నారని వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్. మాధవ రావు అన్నారు.

అమృత హస్తం వ్యవస్థాపకురాలు దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో నగరంలోని పాత్రికేయులకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధీనగర్లోని పాత అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు.

సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తరహాలోనే పాత్రికేయులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు నిర్విరామంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. దారా కరుణశ్రీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని ఒక విపత్కర పరిస్థితిని నేడు దేశం ఎదుర్కొంటోందని గుర్తు చేశారు.

ఈ పరిస్థితుల్లో అమృత హస్తం సంస్థకు ఎంతో ప్రాచుర్యం కల్పిస్తున్న పాత్రికేయులకు తమ వంతు సహాయంగా తమ స్పందనను సహాయం రూపంలో తెలియజేసేందుకే ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

తమతో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ జోనల్ చైర్మన్ మద్దినేని చక్రధర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్, డాక్టర్ కరుణాకర్, గార్లపాటి జగదీష్, ఇతర దాతలు తమకు సహకారం అందించారని తెలిపారు.

లాభాపేక్ష రహితంగా తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను సమాజానికి తెలియజేసేందుకు ప్రసార మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే శ్రీనివాస్, రూప్ నాథ్, శివ, విజయలక్ష్మి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు