'పాలిటిక్స్ గుడ్‌బై' : వల్లభనేని వంశీ ట్వీట్‍‌లోని ఆంతర్యమిదేనా?

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:09 IST)
తెలుగుదేశం పార్టీలో ఇమడలేక ఆ పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ ఊహాగానాలకు ఆయనే ఆజ్యం పోశారు. తాజాగా ఆయన ఓ ట్విట్ చేస్తూ, అందులో "పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఫలితంగా ఈ ట్వీట్‌తో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. 
 
నిజానికి టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన వైకాపాకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, సీఎం జగన్‌తో సహా, ఆ పార్టీ నేతలంతా కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారు. ఇది చాలా మంది నేతలకు నచ్చలేదు. పైగా, అదే సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీకి కూడా వైకాపా నేతల వ్యాఖ్యలు నచ్చలేదు. దీంతో ఆయన ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలగలేక, పార్టీలో ఇమడలేక పోయారు. 
 
అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీలపై ఆయన ఘాటైన విమర్శలే చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వంశీ చేసిన కామెంట్‌తో మళ్లీ చర్చ మొదలైంది. వైసీపీ శిబిరంలో వంశీ ఇమడలేకపోతున్నారా? సొంత నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో దాన్ని వంశీ తొలగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు