రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: జగన్ ఆదేశం
మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:36 IST)
''దిశ యాప్ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు దిశపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో దిశయాప్ డౌన్లోడ్ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. దిశయాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. దిశ యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి అని సీఎం వైయస్ జగన్ సూచించారు.
శాసనసభలో దిశ బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదని సీఎం జగన్ అభిపప్రాయపడ్డారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు.ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. శరవేంగా బాధితులను ఆదుకోవాలి. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి అని సీఎం జగన్ సూచించారు.
సైబర్ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. సమర్థత ఉన్న అధికారులను, సమర్థవంతమైన న్యాయవాదులను ఇందులో నియమించండి. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి అన్నారు సీఎం జగన్.
ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం అన్నారు సీఎం జగన్. బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం అన్నారు సీఎం జగన్.
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా.. లేవా.. సమీక్షించాలి. ఉంటే డ్రగ్స్‌ని ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి అని సూచించారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.