ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తనను మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. చంద్రబాబు సతీమణిపై కొందరు వైసీపీ సభ్యులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. పలువురు సీనియర్ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా ఖండించారు.
సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన కొన్ని విషయాల గురించి నిశితంగా మాట్లాడారు. తమ సతీమణి, ఇతర కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబుకు తెలియదా? ఎన్టీఆర్ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదు. హరికృష్ణ, పురందేశ్వరితో నాకు పరిచయం ఉంది, వాళ్లు చాలా మంచివారు. చంద్రబాబు కన్నీళ్లు డ్రామా అని అనుకోవడం లేదు. చంద్రబాబుకు తెలియదా.. సంపతీ పనిచేయదని, చంద్రబాబు అంతలా స్పందించాల్సిన సమస్య కానే కాదని ఉండవల్లి పేర్కొన్నారు.
ఓ మంత్రి అయితే, రేయ్, వాడు, వీడు అనడం సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబును అంతలా దారుణంగా తిడితే ఎవరు గౌరవిస్తారు? విపక్ష నేతలు, మనుషులకు వైసీపీ మంత్రులు గౌరవించాలి. విపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం. విపక్షంలేని అసెంబ్లీలో వైసీపీ నేతలు భజన చేశారు. పాటలు పాడారు అని ఉండవల్లి సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇప్పటి వరకూ సీఎం వైఎస్ జగన్‌పై పెద్దగా కామెంట్స్ చేయని ఉండవల్లి, ఈ మధ్య పెద్ద ఎత్తునే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై, అసెంబ్లీలో చర్చ చేయాల్సిన ప్రతిపక్షం, ఇలా అసెంబ్లీకి రాననే చంద్రబాబు శపథంలో నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎలా ఒడ్డున పడుతుందో అనే సమస్యపై అందరూ దృష్టి సారించాలని, అఖిలపక్షం వేసి దీనిపై పని చేయాలని ఉండవల్లి సూచించారు.