సర్కారు భూములకు కంచె... ఏపీలో 92 లక్షల ఎకరాలు గుర్తింపు

మంగళవారం, 15 నవంబరు 2016 (15:47 IST)
విజయవాడ : రాష్ట్ర విభజనానంతరం ఏపీలో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా కబ్జా చేసిన భూములను అమ్మకానికి పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం... సర్కార్ భూముల పరిరక్షణకు రంగంలోకి దిగింది. ప్రభుత్వ భూముల చుట్టూ కంచె నిర్మాణం చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నవ్యాంధ్రను పునాదుల స్థాయి నుంచి నిర్మించుకోవాల్సన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం పరిశ్రమలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనకు భూములు విరివిరిగా కేటాయిస్తోంది. 
 
రాజధాని ప్రాంతం అమరావతితో పాటు విశాఖపట్నం, రాజమండ్రి వంటి ముఖ్య నగరాల్లోనూ పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణానికి పూనుకుంది. విద్యా సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో నివాస స్థలాల అవశ్యకత పెరిగింది. దీంతో రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు 13 జిల్లాల్లో భూములకు గిరాకీ పెరిగింది. గత రెండేళ్ల నుంచి భూముల కొనుగోలు, అమ్మకాలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కుల దృష్టి ప్రభుత్వ భూములపై పడింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాల్లో ప్రభుత్వ భూముల్లో పాగా వేసి, వాటిని అమ్మకానికి పెడుతున్నారు. 
 
కేవలం ఈ నగరాల్లోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకోరులు ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం.. సర్కారు భూముల పరిరక్షణ నడుంబిగించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పని రెవెన్యూ శాఖ చేపట్టింది. ఇలా ఏపీలోని 13 జిల్లాల్లో 30 లక్షలకు పైగా సర్వే నెంబర్లలో 92 లక్షలకు పైగా ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఈ భూములు కబ్జాకు గురికాకుండా ఉండే విధంగా, పటిష్ట చర్యలు చేపట్టింది. సర్కార్ భూముల చుట్టూ కంచె ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేస్తోంది.
 
భూముల కంప్యూటరీకరణ...
రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా కంప్యూటరీకరణ చేపట్టింది. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది....ఎంత విస్తీరణంలో ఉంది అనే అంశాలు ఆన్ లైన్లో పొందుపరుస్తున్నారు. దీనివల్ల ఎక్కడయినా ప్రభుత్వ భూమి కబ్జాకు గురయిన వెంటనే గుర్తించడానికి వీలవుతుంది. అదే సమయంలో ఎవరైనా ఆ భూములను అమ్మకాని ప్రయత్నిస్తే, వాటి వివరాలు ఆన్ లైన్లో పొందుపర్చడం వల్ల క్రయ విక్రయాలకు బ్రేక్ పడుతుంది.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో లక్షలాది ఎకరాలు కబ్జా గురికాకుండా మిగిలాయి.
 
ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి...
ఏపీలోని 13 జిల్లాల్లో 92 లక్షల ఎకరాలకు పైగా సర్కారు భూములున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ భూముల వివరాలను సేకరించడమే కాకుండా, వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ భూముల వివరాలను ఆన్ లైన్లో పొందుపర్చింది. రాష్ర్ట వ్యాప్తంగా చూస్తే, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14.53 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 2.60 లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.69 లక్షల ఎకరాలు, విశాఖపట్నంలో 4.77 లక్షల ఎకరాలున్నాయి. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో 2.86 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 3.23 లక్షల ఎకరాలు, కృష్ణాలో 5.05 లక్షల ఎకరాల సర్కారు భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 
 
గుంటూరులో 3.35 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 6.67 లక్షల ఎకరాలు, నెల్లూరులో 11.52 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. చిత్తూరులో 12.84 లక్షల ఎకరాలు, కడపలో 12.09 లక్షల ఎకరాలు, కర్నూలులో 14.53 లక్షల ఎకరాలు, అనంతపురంలో 8.86 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ భూముల వివరాలను ఆన్ లైన్లో పొందుపర్చడంతో, అవి కబ్జాకు గురయ్యే ఆస్కారమే లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి