అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలువలకు గండ్లు పడి రైతులు నిండా మునుగుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం 11 నెంబర్ కాలువ ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కాలువకు గండ్లు పడినపుడల్లా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు...ఇక్కడి అన్నదాతలు.
ఆయకట్టుకు ప్రధాన గ్రామమైన పెదకళ్ళేపల్లి రైతుల ఆవేదన చూసేవారికి కంటతడి పెట్టిస్తున్నాయి. పెదకళ్ళేపల్లి రైతులు మాట్లాడుతూ మోపిదేవి దగ్గర కాలువకు రెండు చోట్ల గండి పడటంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇసుక కట్టలు నామమాత్రంగా వేసి పూర్తిగా నీరు వదలకుండా తక్కువ లెవలింగ్ వదలడం వల్ల పెదకళ్ళేపల్లి చివరి భూముల్లో వ్యవసాయం ప్రశ్నార్థకం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఈ విషయంపై అధికారులతో చర్చించగా, నీరు అందకపోతే వంతులు వారి ఇస్తామని, ఇంకా అందకపోతే ఆవిరి యంత్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. డీజిల్ ఆయిల్ 110 రూపాయలు పలుకుతుంటే ఎకరాకు 20 లీటర్లు పడుతుందని, ఒక డీజల్ కే 2,000 రూపాయలుపెట్టుబడి అవుతుందని ఆవేదన చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని గండ్లు పడిన ప్రదేశంలో పరిశీలించి మరమ్మతులు చేసి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. అలా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో చివరి భూముల్లో వ్యవసాయం ప్రశ్నార్ధకంగ మారుతుందని తెలియజేశారు.