వికటించిన వివాహ పాయసం... 500 మందికి అస్వస్థత

మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఓ వివాహ విందులో వడ్డించిన పాయసం వికటించింది. దీంతో 500 మంది వరకు ఆహుతులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుక పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకలో భాగంగా, విందు భోజనంతో పాటు వడ్డించిన పాయసం వికటించింది. విందులో వడ్డించిన పాయసం ఆరగించిన తర్వాత వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో దాదాపు 500 మంది వరకు అస్వస్థతకు లోనయ్యారు. 
 
బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. వీరంతా మొదటి, రెండు బంతుల్లో వడ్డించిన పాయసం ఆరగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు