ఆంధ్రప్రదేశ్ అక్రమ క్వార్ట్జ్స్ మైనింగ్ కేసుకు సంబంధించి వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆయనను ఆదివారం నాడు బెంగళూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను నెల్లూరుకు తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు.
నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కాకాణి పోలీసుల ఎదుట హాజరు కాలేదు.
ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ఆయన, ముందస్తు బెయిల్ కోసం మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఆయన దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి గత నెలలో పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేసి, విమానాశ్రయాలు, ఓడరేవులకు సమాచారం అందించారు.
వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో కాకాణి అక్రమ క్వార్ట్జ్స్ మైనింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. తాటిపర్తి సమీపంలో మైకా మైనింగ్ లీజు గడువు ముగిసినప్పటికీ, పొదలకూరు మండలం తోడేరు గ్రామం వద్ద క్వార్ట్జ్స్ తవ్వకాలు అక్రమంగా కొనసాగాయని ఆరోపణలున్నాయి.
2019లోనే తెలుగుదేశం పార్టీ నేత, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భారీ అక్రమ మైనింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.
గనులు, భూగర్భ వనరుల శాఖ జరిపిన విచారణలో 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్స్‌ను అక్రమంగా వెలికితీసి రవాణా చేసినట్లు, దీని ద్వారా జరిమానాలతో సహా ప్రభుత్వానికి సుమారు రూ.7.56 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లినట్లు తేలింది.
గత యేడాది టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విచారణలో, మైనింగులో ఉపయోగించే పేలుడు పదార్థాలను కాకాణి అక్రమంగా నిల్వ చేశారని, అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన గిరిజనులను ఆయన బెదిరించారని కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.