గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీకి నిద్రలో శ్వాస ఆగిపోతోందని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. వివిధ కేసుల్లో అరెస్టయి ఉన్న వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ న్యూరాలజీ విభాగానికి చెందిన స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షించారు.
ఇందులో వంశీకి ఫిట్స్ ఉన్నాయని గుర్తించారు. పైగా, నిద్రపోయేటపుడు శ్వాస సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. స్లీప్ టెస్ట్ చేసి చికిత్స చేయాల్సివుందని, అయితే, తమ వద్ద స్లీప్ టెస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు.
మరోవైపు, నకిలీ ఇళ్ల పట్టాల కేసులు వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చేందుకు నూజివీడు కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై పలు దఫాలుగా వాదనలు ఆలకించిన కోర్టు న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. కాగా, ఇదే కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయగా, ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే.