ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఎపుడు?

ఠాగూర్

సోమవారం, 11 నవంబరు 2024 (14:41 IST)
గత ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా ఆయన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఈ యేడాది బడ్జెట్‌లో రూ.4,285 కోట్లను కేటాయించినట్టు తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. 
 
పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేుటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా దీపం-2 పథకం ద్వారా గృహిణులకు ప్రతి యేటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులకు లబ్ది పొందుతున్నారని మంత్రి పయ్యావుల అసెంబ్లీలో వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు