మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా కల్పిద్దాం : ఏపీ రవాణా అధికారుల దృష్టి

వరుణ్

మంగళవారం, 11 జూన్ 2024 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం కల్పించనుంది. ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా కసరత్తులు ప్రారంభించారు. ఈ తరహా పథకం ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో అమలు చేస్తున్నారు. అయితే, అక్కడ కొన్ని రకాలైన విమర్శలు వచ్చాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు తమకు ఉపాధి పోయిందంటూ రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు. ధర్నాలు చేశారు. ఇలాంటి విమర్శలు రాకుండా, ఎలాంటి వివాదం లేకుండా ఏపీలో ఈ పథకాన్ని అమలు చేసే అంశంపై ఏపీ రవాణా శాఖ అధికారులు దృష్టిసారించారు. 
 
దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికనూ సిద్ధం చేశారు. దీని ప్రకారం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు, అలా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. 
 
అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్లు ఉన్నాయి. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 'సున్నా' ఛార్జ్ టికెట్ జారీ చేస్తారు. ఇలా జారీచేసిన టికెట్ల అసలు ఛార్జీ ఎంతో లెక్క కట్టి.. వాటిని రీయింబర్స్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతుంది.
 
ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు రూ.500 కోట్లు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు రూ.200 కోట్లు రాబడి తగ్గుతుందని అంచనా. మరోవైపు ఆర్టీసీ తన రాబడిలో నెలకు రూ.125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ.125 కోట్లు నిలిపేయడంతో పాటు, మిగిలిన రూ.75 కోట్లను ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకోవాలని భావిస్తుంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనిపై ఓ స్పష్టమైన క్లారిటీ రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు