చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయి. నిషేధిత వస్తువులను ఆలయం వద్దకు తీసుకొస్తున్న కొంతమంది యువకులు ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకొస్తున్న యువకులు వాటిని పీల్చుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తుండడం తీవ్ర విమర్సలకు దారితీస్తోంది.
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు సమీపంలో సదాశివకోన, మూలకోన ఆలయాలు ఉన్నాయి. ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాలకు ప్రతిరోజు వందలాదిమంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ఆదివారం అయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. తమిళనాడుకు అతి సమీపంలో ఈ ఆలయాలు ఉండడంతో తమిళ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఆలయాల వద్ద నిషేధిత వస్తువులకు అనుమతి లేదు. అందులోను గంజాయి లాంటి పదార్థాలకు అస్సలు అనుమతించరు.
అయితే తమిళనాడుకు చెందిన కొంతమంది యువకులు ఎంజాయ్ చేయడానికే ఈ ఆలయాలను ఎంచుకుని ఇక్కడకు వస్తుంటారు. వారి వాహనాల్లో గంజాయితో పాటు మద్యం, మాంసంను తీసుకొచ్చి ఆలయాల ఆవరణలోనే సేవిస్తున్నారు. మద్యం, మాంసంను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే గంజాయినే వాడుతుండడం భక్తులను ఇబ్బందులను పెడుతోంది. దీనిపై ఇప్పటికైనా పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది.