గన్నవరంలో హీటెక్కిన రాజకీయాలు - టీడీపీ ఎమ్మెల్యేకు భద్రత పెంపు

సోమవారం, 13 జూన్ 2022 (08:02 IST)
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫలితంగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాకు మద్దతిస్తున్న వల్లభనేని వంశీ మోహన్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఆయనకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ళ భద్రతను ఇపుడు ఏకంగా 25 మందికి పెంచారు. దీనికి కారణం లేకపోలేదు. వల్లభనేని వంశీమోహన్‌ని వైకాపా నేతలు యార్లగడ్డ వెంకట్‌రావు, దుట్టా రామచంద్రరావు టార్గెట్‌ చేయడమే. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ టిక్కెట్‌పై యార్లగడ్డ, రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. దీంతో ముగ్గురు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫలితంగా వారి అనుచరులు కూడా గ్రూపులుగా విడిపోయారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
 
మరోవైపు ప్రభుత్వం చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమలో వల్లభనేని వంశీమోహన్‌ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆయనకు గతంలో ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు అదనంగా మరో 25 మంది పోలీసుల భద్రతను కల్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు