అర్థరాత్రి మళ్లీ గ్యాస్ లీక్ ... ప్రాణభయంతో స్థానికులు పరుగు

శుక్రవారం, 8 మే 2020 (09:21 IST)
విశాఖపట్టణంలోని గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి గురువారం రాత్రి మళ్లీ గ్యాస్ లీకైంది. దీంతో స్థానికులంతా ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ముఖ్యంగా, ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్థరాత్రి వేళ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 
 
మరోవైపు, పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌లోకి వెళ్లి పరిశోధన ప్రారంభించారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని, శుక్రవారం శాస్త్రవేత్తలు ప్రకటన చేయనున్నారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.
 
మరోవైపు, గ్యాస్ లీక్‌ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్ర అస్వస్థకకు లోనైన విషయం తెల్సిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. విషవాయువు ప్రభావంతో కొందరు ఇళ్లలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి వారిని కాపాడినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ స్పందించారు.
 
ఈ దుర్ఘటనపై ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా మూతపడిన పరిశ్రమను పునఃప్రారంభించే సమయంలో గ్యాస్ లీకైనట్టు భావిస్తున్నామన్నారు. లీకైన గ్యాస్‌ను స్టిరీన్‌గా గుర్తించామని, ఇది మానవుల కేంద్ర నాడీ వ్యవస్థపైనా, గొంతు, చర్మం, కళ్లు, ఇతర భాగాలపైనా ప్రభావం చూపిస్తుందని వివరించారు. 
 
ఆర్ఆర్ వెంకటాపురం గ్రామ పరిసరాల్లో తమ బృందాలు పర్యటిస్తున్నాయని, వాటిలో ప్రత్యేకంగా గ్యాస్ లీకేజి సమస్యలకు సంబంధించిన బృందం కూడా ఉందని, అస్వస్థతకు గురైన ప్రజలను గుర్తిస్తున్నామని తెలిపారు. అటు, విశాఖ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఎల్జీ పాలిమర్స్ సంస్థలోని శీతలీకరణ విభాగంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రమాదానికి దారితీసినట్టు చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు