ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్ బారీ సిండ్రోమ్ (సీబీఎస్) ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఈ సిండ్రోమ్ బారినపడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటరుపై చికిత్స అందిస్తూ రాగా, ఆమె ఆదివారం కన్నుమూసింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు. అరుదుగా లక్షమందిలో ఒకరిద్దరికే వచ్చే ఈ సిండ్రోమ్ అనేది నరాల సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య రాష్ట్రంలో పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఈ నెల 11వ తేదీన ఏకంగా ఏడు కేసులు రావడం గమనార్హం. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరు వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 మంది ఈ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అలాంటి వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే,
వేళ్ళు, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్టు అనిపించడం.
కాళ్ళలో మొదలై బలహీనత పైకి విస్తరించడం, కాళ్ల నొప్పులు.
కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, మంటగా అనిపించడం.
సరిగ్గా నడవలేకపోవడంత, తూలడం, మెట్లు ఎక్కులేకపోవడం.
నోరు వంకరపోవడం, మాట్లాడటం, నమలడం, మింగడంలో ఇబ్బంది
మెడ నిలబడలేకపోవడం, ముఖ కండరాల్లో కదలికలు లేకపోవడం
ఒకటికి రెండు దృశ్యాలు కనిపించడం. కళ్లు కదిలించలేకపోవడం. పూర్తిగా మూయలేకపోవడం.
వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం. ఇలాంటి వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందించడం.
కొందరిలో గుండె వేగం అస్తవ్యస్తమవడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి.