నాప్రాణం కంటే నువ్వే ఎక్కువ... చనిపోయే ముందు ఒక్కసారి చూడాలనివుందిరా అంటూ...

శుక్రవారం, 23 జూన్ 2017 (10:01 IST)
ప్రేమికుడి చేతిలో ఓ యువతి మోసపోయింది. తన ప్రాణం కంటే ఎక్కువగా భావించి ప్రేమించి, నమ్మినందుకు చివరకు ఆ యువతి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషాదకర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిడదవోలు మండలం తాళ్ళపాలెంకు చెందిన పిల్లి బేబికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె నాగరత్నం (నాగమణి) (21) ఇదే మండలం అట్లపాడుకు చెందిన కల్యాణ్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి పెద్దలకు తెలియడంతో పెళ్ళి చేసేందుకు అంగీకరించారు. 
 
దీంతో కల్యాణ్‌పై నాగరత్నం మరింత ప్రేమను పెంచుకుంది. అయితే ఈ పెళ్లికి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడకపోవడంతో కల్యాణ్‌ రెండు వారాలుగా ఆమెకు కనిపించకుండా పోయాడు. ఫోన్‌ చేసినా మాట్లాడేందుకు సుముఖత చూపలేదు. దాంతో తాను మోసపోయానని గుర్తించిన నాగరత్నం తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనసులోనే కుమిలిపోయింది. 
 
ఎన్ని రోజులు ఎదురుచూసిన ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో తీవ్ర మనస్తాపంతో గురువారం తెల్లవారు జామున తల్లి నిద్రిస్తున్న పక్కగదిలోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలు నాగరత్నం చనిపోయే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. "బావా.. నాప్రాణం కన్నా నీవే ఎక్కువ అంటూ లేఖను ప్రారంభించి నీకు దూరం అవుతున్న మణి..." అంటూ లేఖను ముగించింది. 
 
లేఖలో ‘బావా నిన్ను ఒకేఒకసారి చూడాలని ఉందిరా.. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బావా’ అంటూ పేర్కొంది. మీ అమ్మ, నాన్న మోసగించడమే కాకుండా నువ్వు కూడా మోసగించడం తట్టుకోలేకపోతున్నా అందుకే చనిపోతున్నా అంటూ పేర్కొంది. నాగరత్నం చనిపోవడానికి ముందు తాను పడిన మనోవేదనను వివరిస్తూ తల్లికి లేఖ రాసింది. 
 
అమ్మా నన్ను క్షమించు.. నేను మోసపోయాను. నాలో నేను బాధపడుతt మీ ముందు నవ్వుతూ నటించడం నావల్ల కావడం లేదు. నాకు బతకడం ఇష్టం లేదు. నాన్నను బాగా చూసుకో, చెల్లిని బాగా చదివించు నేను సంతోషంగానే చనిపోతున్నాను. నన్ను క్షమించండి.. ఐ లవ్‌యూ అమ్మా మీకు దూరం అవుతున్న మీ మణి... అంటూ లేఖలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి