స్థానిక అక్కారంపల్లి వద్దనున్న రాదేష్ శర్మ అపార్టుమెంట్‌లో నివాసముంటున్నారు వీరు. సుబ్రమణ్యం పెట్రోల్ బంక్ నడుపుతుండగా... భార్య మధులత హౌస్ వైఫ్‌గా ఉండేది. వీరికి ఒక కుమార్తె. ప్రస్తుతం 7వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తోంది హాసిని. చదువులో ఈమె ఎప్పుడూ ముందంజే. క్లాస్ ఫస్ట్. అలాంటి హాసిని బోటు ప్రమాదంలో కనిపించకుండా పోయింది.
శనివారం తిరుపతి నుంచి వెళ్ళిన కుటుంబం రాజమండ్రిలో అస్థికలను కలిపారు. ఆదివారం మధ్యాహ్నం పాపికొండలకు వెళ్ళి బోటెక్కారు. తండ్రి సుబ్రమణ్యం, తల్లి మధులత పక్కపక్కనే కూర్చున్నారు. చిన్నారి హాసిని మాత్రం వెనకాల కూర్చుని సెల్ ఫోన్లో అందాలను రికార్డ్ చేస్తోంది. అయితే ఉన్నట్లుండి మధులత కూడా పైకి లేచి తన సెల్ ఫోన్లలో ఫోటోలను తీస్తోంది. సుబ్రమణ్యం కూడా ఆమె దగ్గరే ఉన్నాడు. బోటు అలలను ఢీకొని గట్టి శబ్ధంతో బోల్తా పడింది. దీంతో సుబ్రమణ్యం తన భార్య మధులతను కాపాడాడు.
ఆమెను బోల్తాపడిన బోటుపైకి ఎక్కించాడు. అయితే దూరంలో ఉన్న హాసిని మాత్రం కనిపించకుండా పోయింది. సుబ్రమణ్యం తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు తాను కనిపించకుండా పోయాడు. దీంతో మధులత గుండెలవిసేలా రోదించింది. కళ్ల ముందే భర్త, కుమార్తె నీటిలో కనిపించకుండా పోయారు.