గోదావరి మహోగ్రరూపం: ధవళేశ్వరం వద్ద ఆనాటి పరిస్థితులు

శనివారం, 16 జులై 2022 (09:35 IST)
గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో వచ్చిన జలాలను వచ్చినట్లే సముద్రంలోకి వదిలేస్తున్నారు. 
 
ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 19.50 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదల కారణంగా 279 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.
 
ధవళేశ్వరం వద్ద ఆనాటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్యాటన్‌ బ్యారేజీకి 1986 ఆగస్టు 16న రికార్డు స్థాయిలో 35.06 లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చాయి. 
 
అప్పట్లో బ్యారేజీ నీటిమట్టం 24.55 అడుగులకు చేరింది. జులై నెలలో చూస్తే.. అత్యధికంగా 1988 జులై 30న 17.50 అడుగులకు నీటి మట్టం చేరగా 21,22,310 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదిలారు.
 
ప్రస్తుతం ఆ స్థాయికి ఇన్‌ ఫ్లో దాదాపుగా చేరింది. గోదావరిలో చివరిసారిగా 2006 ఆగస్టు 7న ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నీటి మట్టం 22.80 అడుగులకు చేరింది. అప్పట్లో 28,50,664 క్యూసెక్కుల వరద వచ్చింది.
 
వరదలు వచ్చినప్పుడు ఏ గ్రామం ఏ స్థాయి వరదకు ముంపునకు గురవుతుందో ఫ్లడ్‌ మాన్యువల్‌లో విపులంగా నమోదు చేశారు. కానీ వరద పెరుగుతున్నా, చాలా గ్రామాలకు అధికారులు చేరుకున్న దాఖలాలు లేవు. 
 
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో బెస్తగూడెం గ్రామస్థులు ముంపు భయంతో వారే ఊరిని ఖాళీ చేసి తరలిపోయారే తప్ప అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు.
 
గోదావరి వరద రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. భద్రాచలం వద్ద 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం మరోసారి 70 అడుగులు దాటింది. నీటిమట్టం శుక్రవారం రాత్రి పది గంటలకు 71 అడుగులకు చేరి 24.29 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో అనేక గ్రామాలను ముంచేసింది.
 
శనివారం ఉదయానికి ఇది మరింత తీవ్రం కానుంది. కేంద్ర జలసంఘం, నీటిపారుదల శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గోదావరి చరిత్రలో రెండుసార్లు 70 అడుగుల మట్టం దాటగా, ఇది మూడోసారి.
 
కోనసీమ జిల్లాలో 256 హెక్టార్లలో వరి నారు, నాట్లు నీట మునిగాయి. 2,866 హెక్టార్లలో ఉద్యాన పంటలు మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2,302.10 హెక్టార్లలో వ్యవసాయ, 1,315.43 హెక్టార్ల ఉద్యాన పంటలు, పలుచోట్ల నర్సరీలు, పూలతోటలు ముంపునకు గురయ్యాయి. తూర్పుగోదావరి పరిధిలో 268.67 కి.మీ దారులు, కోనసీమ జిల్లాలో 247.72 కి.మీ పొడవున దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు