జీవోల‌ను దాచేసి, స‌మ‌చార హ‌క్కు ఉల్లంఘ‌న‌; హైకోర్టులో వ్యాజ్యం

బుధవారం, 25 ఆగస్టు 2021 (11:19 IST)
ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను ఇకపై వెబ్‌సైట్‌లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారమై సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆగస్టు 15న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ, ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు సీహెచ్‌ కృష్ణాంజనేయులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 
 
జీఏడీ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘ఏపీ ప్రభుత్వ జీవోలను ఆన్‌లైన్లో ఉంచడం 1990 నుంచి కొనసాగుతోంది. సమాచారహక్కు చట్టం(సహ చట్టం)లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా 2008 నుంచి పూర్తి స్థాయిలో పారదర్శకంగా జీవోలను ఆన్‌లైన్లో ఉంచుతున్నారు. గత ప్రభుత్వం సైతం ఈ విధానాన్ని కొనసాగించింది. ప్రస్తుత ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్లో ఉంచకూడదని నిర్ణయించింది. ఈ వ్యవహారమై అన్ని శాఖలకు జీఏడీ ముఖ్యకార్యదర్శి (రాజకీయ)నోట్‌ను పంపించారు. సహ చట్టం సెక్షన్‌ 4(1) (బి) ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలో ఉంచాల్సిన అవసరం ఉంది. 
 
భద్రత, నిఘా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు తప్ప ఇతర ఏ జీవోలైనా ప్రజా పత్రాలే(పబ్లిక్‌ డాక్యుమెంట్‌). సహ చట్టం సైతం ఆ పత్రాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తోంది. ఆగస్టు 2నుంచి ప్రభుత్వం బ్లాంక్‌ ఆర్డర్లను వెబ్‌సైట్లో ఉంచడం ప్రారంభించింది. ఈ విధంగా 60 జీవోలు ఇచ్చారు. ఆగస్టు 17 నుంచి వెబ్‌సైట్లో జీవోలను అప్‌లోడ్‌ చేయడం పూర్తిగా నిలిపేశారు. 
 
జీఏడీ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు సహచట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. జీవోలను రహస్యంగా ఉంచేందుకు అధికారులకు అనుమతిస్తే, పరిపాలన వ్యవహారమంతా చీకటిమయం అవుతుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోలను వెబ్‌సైట్లో ఉంచకూడదన్న నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించండి. జీవోలన్నింటినీ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసేలా అధికారులను ఆదేశించండి’ అని హైకోర్టు కేసులో కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు