50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:41 IST)
నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై తెలంగాణ తరుపున వాదనలు గట్టిగా వినిపిస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి రజత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని గుర్తు చేశారు. న్యాయమైన వాటా కోసం సమావేశంలో ప్రశ్నిస్తామన్నారు. 
 
ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టు అని సమావేశంలో గట్టిగా చెప్పనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం ఇవ్వాల్సిందే రజత్ కుమార్ స్పష్టం చేశారు.
 
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నీటి పంపకాలపై మీటింగ్ కొనసాగుతుంది. ఈ మీటింగ్‌కు రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సహా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఓ కొలిక్కి వస్తాయా లేక మళ్లీ పంచాయితీ కేంద్రం వద్దకు వెళ్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 
 
బోర్డు పరిధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం వాడివేడిగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను మాత్రమే పూర్తిగా బోర్డు పరిధిలో ఉంచితే సరిపోతుందని, అన్ని ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. తెలంగాణ కూడా దీనిపై వివరంగా చర్చించింది. 
 
తన అభిప్రాయాన్ని బోర్డు సమావేశంలో చెప్పడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. నీటి వాటాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు