బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. తొమ్మిది రోజులు పాటు వరుసగా అమ్మవారు 9 రూపాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 7న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, 8న బాలా త్రిపుర సుందరీ దేవిగా, 9న గాయత్రీదేవిగా, 10న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 11న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శన మివ్వనున్నారు.
12న సరస్వతీదేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసురమర్ధినిగా, 15న రాజరాజేశ్వరి దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 12 తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కానీ, ఈసారి కోవిడ్ పుణ్యమా అని భక్తులకు ఆంక్షలు తప్పడం లేదు.