30 అర్థరాత్రి నుంచి జీఎస్టీ... 115 వస్తువులపై పన్ను తగ్గింపు... యనమల

శుక్రవారం, 23 జూన్ 2017 (18:11 IST)
అమరావతి: రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఈ నెల 30 అర్థరాత్రి నుంచి జీఎస్టీ పన్నుల విధానం అమలుకానుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దీనిపై ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ మోడల్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ నెల 30 తేదీన జీఎస్టీ మోడల్ నోటిఫికేషన్ జారీ చేయనుందన్నారు. అనంతరం అదే రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోడి లాంఛనంగా జీఎస్టీ పన్నుల విధానాన్ని ప్రారంభిస్తారన్నారు. 
 
జీఎస్టీ కౌన్సిల్ విడుదల చేసిన మోడల్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా నిబంధనలు పొందించిందన్నారు. 115 వస్తువులపై జీఎస్టీ పన్ను భారం తగ్గుతుందన్నారు. 37 వస్తువులపై పన్ను పెరగబోతుండగా, 180 వస్తువుల పన్నులో ఎటువంటి మార్పూ ఉండదని మంత్రి తెలిపారు. సేవా రంగానికి సంబంధిచి 14 వస్తువులపై పన్ను భారం తగ్గుతుండగా, 27 వస్తువులపై పెరుగుతోందని అన్నారు. పది వస్తువులపై ఎటువంటి సర్వీసు ట్యాక్స్ పెరగడంలేదని మంత్రి యనమల తెలిపారు. 
 
ఫెర్టిలైజర్లు, ట్రాక్టర్లు, చేనేత, గ్రానైట్, సిన్మా టిక్కెట్ల ధరలపై పన్ను మినహాయించాలని కోరుతూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. పోలవరం, టీటీడీపై పన్ను మినహాయింపునకు కేంద్రం అంగీకరించలేదన్నారు. మరోసారి ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. పొగాకు పైనా పన్ను మినహాయించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి యనమల తెలిపారు. జీఎస్టీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,920 కోట్ల మేర భారం పడుతోందన్నారు. 14 శాతం కంటే గ్రోత్ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేయనుందన్నారు. ఏపీకి కలుగుతున్న రూ.2,920 కోట్ల నష్టం కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు.
 
కమర్షియల్ చెక్ పోస్టుల మూత...
జీఎస్టీ అమలులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కమర్షియల్ చెక్ పోస్టులు మూసివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ ద్వారా ఒకే పన్ను విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ చెక్ పోస్టులు ఎత్తివేస్తున్నామన్నారు. ఏపీకి సంబంధించి ఒడిశా, కర్ణాటక సరిహద్దుల్లో కమర్షియల్ చెక్ పోస్టులు అధికంగా ఉన్నాయన్నారు. ఈ చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బందిని సంబంధిత శాఖలోకి తీసుకుంటామన్నారు. 
 
ఈ వే బిల్లు కొనసాగింపు...
సరుకుల తరలింపులో వాహనాలకిచ్చే ఈ వే బిల్లు విధానాన్ని రాష్ట్రంలో కొంతకాలం పాటు కొనసాగించనున్నట్లు మంత్రి యనమల తెలిపారు. జీఎస్టీ విధానంలో భాగంగా ఈ వే బిల్లు విధానాన్ని నిలిపేయాల్సి ఉందన్నారు. అయితే, ఈ వే బిల్లు విధానం ఏపీలో 15 ఏళ్ల నుంచి కొనసాగుతోందన్నారు. దీనిపై జీఎస్టీలో కొంత వెసులుబాటు కల్పించారన్నారు. ఈ వే బిల్లుపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే వరకూ ఈ విధానం కొనసాగింపునకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించిందన్నారు. 
 
రుణమాఫీ... ఫ్యాషన్ కాదు అవసరం...
ఒక ప్రశ్నగా సమాధానంగా... రైతు రుణమాఫీ ఫ్యాషన్ కాదని అవసరమని మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొదటిసారి రుణమాఫీ చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనతకెక్కిందన్నారు.
 
జి.ఎస్.టి., జి.ఎస్.డి.పి.పై సమీక్ష 
అంతకుముందు జి.ఎస్.టి., జి.ఎస్.డి.పి పై అధికారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల ఏయే వస్తువులపై పన్ను భారం పడుతోంది...రాష్ట్రంపై ఏ మేర ప్రభావం చూపుతోంది? ఆర్థికశాఖాధికారులతో చర్చించారు. జి.ఎస్.డి.పి.పై ఆయన సమీక్షిస్తూ, 2015-16 ఏడాదిని ప్రమాణికంగా తీసుకుని, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలతో ఏపీ ఉత్పాదక శక్తిని బేరీజు వేయాలన్నారు. అలాగే, జిల్లాల వారీగా ఆయా రంగాలకు సంబంధించిన చార్టులు రూపొందించి, విశ్లేషించాలన్నారు. తక్కువ గ్రోత్ ఉన్న శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలతో పలు సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డి.సాంబశివరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునీత, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎన్.వై శాస్త్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి