అయ్యా.. పవనూ ట్వీట్లొద్దు కానీ.. క్లారిటీ కావాలి: గుడివాడ అమర్నాథ్

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:45 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జనసేన అధినేత, సినీన‌టుడు పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేయడం కాదని.. హోదా విషయమై సీఎం చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. ప్రభుత్వ తీరుపై పవన్ కల్యాణ్‌ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. స్పెషల్ స్టేటస్‌పై పోరాటమా? చంద్రబాబును నిలదీయటమా? అనేది పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవాలన్నారు. 
 
హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన అమర్నాథ్ పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌న్నారు.  బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వనందుకే వారు ఈ సంబరాలు చేసుకున్నారా? అని ప్రశ్నించారు. 
 
ఓటుకు నోటు కేసు అనంత‌రం, రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడు న్యాయ‌మే జ‌రిగిన‌ట్లుగా భావిస్తున్నారని అమర్నాథ్ విమ‌ర్శించారు. ఓ వైపు ఏపీ నష్టపోతుంటే సీఎం చంద్రబాబు మాత్రం హ్యాపీగా ఉన్నారని.. ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి ఆయనే ప్రధాన కారణమన్నారు. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చి హోదా విషయంలో ముందుకెళ్లాలని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి