ఏపీకి చెందిన కొందరు విద్యార్థులు దొంగలయ్యారు. బీటెక్ విద్యాభ్యాసం చేయమని వారి తల్లిదండ్రులు కాలేజీలో చేర్పించారు. కానీ వారు మాత్రం యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు. పలువురు విద్యార్థులు కలిసి బైక్ చోరీ ముఠాగా అవతరించి, వివిధ ప్రాంతాల్లో ఏకంగా 16 బుల్లెట్ బైకులను చోరీ చేశారు. వీరంతా యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనాల్లో నైపుణ్యం సంపాదించినట్టు విచారణలో వెల్లడిచడం గమనార్హం. అద్దంకి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా వీరివద్ద జరిపిన కేసు విచారణలో అసలు నిజాలు వెల్లడయ్యాయి.
ఈ విద్యార్థులంతా గత కొంతకాలంగా బైకులు దొంగతనాలు చేస్తున్నట్టు తేలింది. వీరు అద్దంకితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్రవానాలను చోరీ చేసినట్టు వెల్లడించారు. రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో బైకులను దొంగిలించి వాటిని విక్రయించి, ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్టు చెప్పారు. అరెస్టయిన విద్యార్థుల నుంచి ఐదు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టవర్ డంప్ టెక్నాలజీ ద్వారా వీరి ఆచూకీ తెలుసుకున్నట్టు జిల్లా ఎస్పీ తుషార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆరుగు విద్యార్థులు ఒంగోలులో మరొకరు కందుకూరులో చదువుతున్నారు.
దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ, విద్యార్థులు విద్యా సంస్థల వెలుపల చేసిన చర్యలకు తాము బాధ్యత వహించలేమని తెలిపింది. మరోవైపు, పోలీసులు మాత్రం ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించారు.