వివాహిత స్నానం చేస్తుండగా నగ్నవీడియో.. ఆపై కోర్కె తీర్చాలంటూ వేధింపులు...

మంగళవారం, 4 మే 2021 (10:25 IST)
ఓ మహిళ స్నానం చేస్తుండగా కొందరు బంధువులు ఆమెను నగ్నంగా వీడియో తీశారు. ఆ తర్వాత కొందరు కోర్కె తీర్చాలంటూ వేధించారు. మరికొందరు రూ.లక్షల్లో డబ్బులు కావాలంటూ వేధించారు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో ఆ వివాహిత మరోమార్గం లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బలవన్మరణానికి పాల్పడేముందు.. ఓ సెల్ఫీ వీడియో తీసి.. ఆ కామాంధులు, వేధింపురాయుళ్ల పేర్లను బయటపెట్టింది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పొన్నూరు 17వ వార్డులో నివసించే బలిమిడి లక్ష్మీతిరుపతమ్మ (32) ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. పనికి వెళ్లిన భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చినా భార్య ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అతను అత్తమామలు, బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. 
 
అందరూ కలిసి తలుపులు పగలగొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స చేశాక స్పృహలోకి వచ్చిన ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలిపింది. అన్ని వివరాలతో ఫోన్‌లో వీడియో తీసి ఉంచానని, చూడాలని చెప్పింది. 
 
ఫోన్‌లో వీడియో చూడగా.. లక్ష్మీతిరుపతమ్మ స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఉంది. వారికి రూ.లక్షల్లో ఇచ్చానని, ఇంకా కావాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, చనిపోవాలని ప్రేరేపిస్తున్నారని, అడిగినంత డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరు మరోలా వేధిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం మృతిచెందింది. తన భార్య మృతికి కారణమైన అన్నావారి శ్రీనివాసరావు, కొంకిపూడి సురేష్, నాగలక్ష్మి, సూర్యారెడ్డి, హరీష్‌, కొంకిపూడి లక్ష్మీ తిరుపతమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు