మీడియా నియంత్రణ జీవోపై జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరణ
సోమవారం, 1 జూన్ 2020 (21:10 IST)
నిరాధారమైన, వాస్తవదూరమైన, తప్పుడు వార్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కల్గించే వార్తా కథనాలను పత్రికల్లో ప్రచురించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2430 ను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇటువంటి వార్తా కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు చట్టప్రకారం రీజాయిండర్ లు విడుదల చేసేందుకు, అవసరమైన పక్షంలో కేసులు నమోదు చేసేందుకు అధికారాలు కల్పించడం జరిగిందని ఈ అంశంపై ప్రతివాదులైన సాధారణ పరిపాలన శాఖ(సమాచార పౌర సంబంధాల శాఖ) కార్యదర్శి హైకోర్టుకు సమర్పించిన వివరణను హైకోర్టు వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
ఈ చర్య కేవలం క్రిమినల్ చర్యకు ఉద్దేశించినది కాదని పేర్కొన్న వివరణను కూడా హైకోర్టు వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
పత్రికాస్వేచ్ఛను పరిమితం చేయడంగానీ, సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడంగానీ, ప్రచురణ, పంపిణీ స్వేచ్ఛలను అరికట్టడం గానీ జీవో ఉద్దేశం కాదని ప్రతివాదులు పేర్కొన్న వివరణను కోర్టువారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
నైతిక విలువలతో కూడిన బాధ్యాతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ ఈ జీవో ప్రధాన ఉద్దేశమన్న ప్రతివాదుల సమాధానాన్ని హైకోర్టు వారు పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడించింది.
పైన పేర్కొన్న విధంగా ప్రతివాదులు సమర్పించిన వివరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశంపై ప్రస్తుత తరుణంలో జోక్యం అవసరం లేనిదిగా హైకోర్టు వారు భావించడం జరిగింది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నిబంధల మేరకు సదరు వార్తా కథనాలు ప్రచురించుటం సముచితం అని హైకోర్టువారు భావించడం జరిగింది.
ఇందుమూలముగా జీవో ప్రకారం వార్తా కథనాలు, ప్రసారాలపై ప్రభుత్వం చేపట్టే ఎటువంటి చర్యలైనా ఆయా న్యాయస్థానాలు వాటి పరిధికి లోబడి చట్టప్రకారం తగు విచారణ జరిపేందుకు స్వేచ్ఛ కల్పించడమైనదని తీర్పులో పేర్కొనడం జరిగింది.