ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: వామపక్ష పార్టీల డిమాండ్

సోమవారం, 27 జులై 2020 (14:24 IST)
కరోనా కట్టడిలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయని, రోగులకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా విపత్తుపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు డిమాండు చేశారు.
 
కరోనా విజృంభణ నేపధ్యంలో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని, నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్ష పార్టీల నేతలు సోమవారం నిరసనకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా విజయవాడ దాసరిభవన్లో వామపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేసి కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
 
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ కరోనా ప్రారంభ దశలో కరోనా నియంత్రణకు ప్రధాని మోడీ చురుగ్గా వ్యవహరించారని, ఆ సమయంలో ప్రజలు స్వచ్చందంగా సహకరించారని గుర్తు చేశారు. నేడు కరోనాను మోడీ గాలికొదిలేశారని, రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో అంతుపట్టడం లేదని విమర్శించారు.

కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే కార్యక్రమాల పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారన్నారు. 150 కోట్ల ప్రజలకు ప్రధానిగా ఉన్న మోడి ప్రజల ప్రాణాలకంటే ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూలదోసే పనిలో నిమగ్నమయ్యాడరన్నారు. ఇటు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా పై మొదటి నుంచి తేలిగ్గా తీసుకుని పారాసిటమల్ తోనూ, బ్లీచింగుతోనూ కరోనాను పారదోలవచ్చని పలు వ్యాఖ్యలు చేశారన్నారు.

ఆ తరువాత కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరని, ఇప్పుడు కరోనా అందరికీ వస్తుందని చెబుతూ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణపై జగన్ ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే వైద్య సేవలు బ్రహ్మాండంగా జరగాల్సి ఉందని, ఆచరణలో ఎక్కడా జరగడం లేదన్నారు. కరోనా రోగులకు భోజనం కోసం రోజుకు రూ. 500 కేటాయిస్తే వారికి నాసిరకం భోజనం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు 1041మంది మృతి చెందారని, రోజు రోజుకు మృతుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా రోగులు ఎంత మందికి వైద్యం అందించారో ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని డిమాండు చేశారు. నిజంగా ఎపీలో అంత వైద్య సేవలు అందుతుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. సీఎం చెబుతున్న దానికి, చేస్తున్న దానికి పొంతన లేదన్నారు.

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వైఫల్యం చెందాయని తూర్పారబట్టారు. విజయవాడలో వైద్య పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని, ఆలా పార్టీలతో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది రాష్ట్ర ప్రజల సమస్య అని, సీఎం ఒక్కడే సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవడం తగదని, ఇది ఆయన సొంత పార్టీ వ్యవహారం కాదన్నారు. కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటి ఫలితాలను సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. సీఎం జగన్ రాజధాని మార్పు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వంటి వివాదాస్పద అంశాల పైనే దృష్టి పెట్టారని, కక్షసాధింపు ధోరణితో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారన్నారు. కరోనా ఆసుపత్రుల్లో రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్ల కంటే రోగులు అత్యధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనికి నిదర్శనంగా నెల్లూరు కరోనా ఆసుపత్రిలో 300 బెడ్లకు గాను 600 మంది రోగులున్నారని తెలిపారు.

ఎస్ఆర్ఐ ఆసుపత్రిలో 200 బెడ్లకు గాను 700 రోగులున్నారని, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి దాపురించిందని వివరించారు. ఎవరు బతికారో, ఎవరు చనిపోయారో తెలియని దుస్థితి నెలకొందన్నారు. 100 పేషంట్లకు ముగ్గురు నర్సులు సేవలందిస్తున్నారని, చనిపోయిన పేషంట్లను సైతం నర్సులే తరలించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నట్లుగా కరోనా వైద్యం ఏ ఆసుపత్రిలో జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ప్రభుత్వం అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వైద్య సేవల్లో వైద్యులు, నర్సులు శక్తికి మించి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో కరోనా వైద్య సేవలందించడంలో ప్రభుత్వం వెనుకబాటుకు గురైందన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ఆందోళన పరిస్థితులు దృష్టిలో ఉ ంచుకుని ప్రైవేటు రంగ సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోని వెంటిలేటర్లను ప్రభుత్వాసుపత్రుల కోసం స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్ల కొరత ఏర్పడిందన్నారు. క్వారంటైన్లలో ఆహార ఏర్పాటు సరిగా లేనందున రోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
 
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి. ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలపై చూపుతున్న శ్రద్ధ కరోనా నియంత్రణలో చూపడం లేదన్నారు. కరోనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం కోసం దర్శనాలకు అనుమతించడం తగదన్నారు.

ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మెరుగైన వైద్య సేవలందించాలని, లేకుంటే 10 వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
 
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు సుందరరామరాజు మాట్లాడుతూ కరోనా ఉధృతి క్రమేపీ పెరుగుతున్న రీత్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించేందుకు ఉపక్రమించాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.

మాస్కుల నుంచి శానిటైజర్ల వరకు పెద్ద ఎత్తున బిల్లులు చేసుకుని అవినీతికి పాల్పడ్డారని విమర్శలున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
 
ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు ఖాదర్ బాష మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాతో పాటు అంటువ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో సరైన బెడ్లు లేనందున కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
 
ఎసీయూసీఐ రాష్ట్ర నాయకులు కె.సుధీర్ మాట్లాడుతూ ప్రజలకు తగినంత బడ్జెట్ కేటాయించి కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రైవేటు వైద్య శాలల్లో కరోనా సేవల అనుమతికి ఆదేశించాలన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచి కరోనా నివారణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అఫ్సర్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు