ఏపీలో వైద్య సౌకర్యాల కోసం 27న వామపక్షాల ధర్నా

శనివారం, 25 జులై 2020 (10:04 IST)
ఏపీలో ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతూ ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేయాలని 10 వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.

ఈ మేరకు వామపక్షాల రాష్ట్ర నాయకులు పి మధు (సిపిఎం), కె రామకృష్ణ (సిపిఐ), వై సాంబశివరావు (సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), జాస్తి కిషోర్‌ బాబు (సిపిఐ ఎంఎల్‌), కాటం నాగభూషణం (ఎంసిపిఐ యు), బి బంగార్రావు (సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), బిఎస్‌ అమర్‌నాథ్‌ (ఎస్‌యుసిఐ సి), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌ బ్లాక్‌), జానకిరాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో రోజుకు 8వేల కేసులు పైబడి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు సరిగా అందక రోగులు నిస్సహాయులుగా ఉండిపోతున్నారని పేర్కొన్నారు. రోగులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

ఆసుపత్రుల్లోనూ, క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ రోగులకు సరైన ఆహారం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు